కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుత్రులు అప్రమత్తమయ్యాయి. కరోనా వార్డులను పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2300 పడకలు అందుబాటులో ఉండగా వాటిల్లో 100 మంది వరకూ చికిత్స పొందుతున్నారు. సుమారు 4వేల మంది హోం ఐసోలేషన్‌లోనే చికిత్స అందిస్తున్నారు. అన్నిరకాల సేవలూ అందుబాటులో ఉన్నా.. జనం అప్రమత్తంగా ఉండి కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.
రెండు వేల పడకలు సిద్ధం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా కోరలు చాస్తుండటంతో... రోగులకు చికిత్స అందించడానికి వైద్యారోగ్య శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. గతేడాది ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల్లో సదుపాయాలను మరింత మెరుగుపరిచారు. అత్యవసర చికిత్స కోసం వెంటిలేటర్లు, ఆక్సిజన్, సిటీస్కాన్ పరికరాలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగుల కోసం 2వేల370 పడకలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆందోళన వద్దు
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 16 వందల 10 పడకలు సిద్ధం చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 130పడకలు ఏర్పాటుచేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించవచ్చని చెప్పడంతో జిల్లాలో 53ఆసుపత్రులు ముందుకువచ్చాయి. జిల్లా వ్యాప్తంగా రెండున్నర వేలకు పైగా క్రీయాశీల కేసులుండగా... 49మంది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో, 23మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. మిగిలినవారు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం 70 బెడ్లు సిద్ధంగా ఉంచారు. ఇటీవల కరోనా బాధితుల సంఖ్య నారాయణపేట జిల్లాలో పెరుగుతున్నా జిల్లా ఆసుపత్రిలో మాత్రం ఎవరూ చేరలేదు. ప్రస్తుతం జిల్లాలో 395 క్రీయాశీల కేసులున్నాయి. కొవిడ్ బారిన పడిన రోగులు ఏ మాత్రం ఆందోళన చెందవద్దని, చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి సూపరింటిండెంట్ రాంకిషన్ వెల్లడించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 170 పడకలు అందుబాటులో ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో 50, కల్వకుర్తి ఆసుపత్రిలో 30, అచ్చంపేటలో 30, కొల్లాపూర్‌లో 30, అమ్రాబాద్‌లో 30 చొప్పున మంచాలు సిద్ధం చేశాం. 11 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వనపర్తి జిల్లాలో కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే 150 బెడ్లు సిద్ధం చేశాం. జిల్లాలో 1,260 యాక్టివ్ కేసులు ఉన్నా.. కేవలం ఇద్దరు మాత్రమే ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు పొందుతున్నారు. మిగతా 1258 మంది ఇళ్ల దగ్గరే ఉంటూ చికిత్స చేయించుకొంటున్నారు. ప్రస్తుతానికి 148 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేవు.