ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే జడ్చర్ల, అచ్చంపేట పురపాలిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వాల విషయంలో దోబూచులాట కొనసాగుతోంది. నామపత్రాల దాఖలుకు గడువు ముగిసినా.... బీఫాం సమర్పించేందుకు నేటి వరకూ గడువు ఉంది. ఏ పార్టీలూ ఇప్పటికీ అభ్యర్థులకు బీఫాంలు జారీ చేయలేదు. కారణం ఒక్కో వార్డుకు ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావహులు వారివారి పార్టీల తరపున నామపత్రాలు దాఖలు చేశారు. వారిలో ఎవరికి ముందుగా అభ్యర్థిత్వం ఖరారు చేసినా.... బీఫాం దక్కని వాళ్లు ప్రత్యర్థి పార్టీల నుంచి బీఫాంలు పొంది... పోటీలో నిలుస్తారన్న ఆందోళన అన్ని పార్టీలను వెంటాడుతోంది. లేదంటే పార్టీ ఫిరాయిస్తారేమోనని నాయకత్వం ఆందోళనకు గురవుతోంది.
పోటాపోటీ
ముఖ్యంగా తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న జడ్చర్ల, రెండోసారి ఎన్నికలు జరుగుతున్న అచ్చంపేటలో తెరాస ఆశావహుల మధ్య పోటీ అధికంగా ఉంది. జడ్చర్లలో 27 వార్డులకుగాను తెరాస తరపున 67మంది, అచ్చంపేటలో 20 వార్డులకు 62 మంది ఆశావహులు నామపత్రాలు దాఖలు చేశారు. ఒక్కోవార్డులో ముగ్గురు నలుగురు పోటీ పడినా... బీఫాం మాత్రం ఒక్కరికే ఇవ్వాలి. అందుకే గెలుపు గుర్రాలకే అభ్యర్థిత్వాలను ఖరారు చేసి... మిగిలిన వారిని బుజ్జగించేందుకు తెరాస చర్యలు చేపట్టింది.
ప్రతిష్ఠాత్మకం
కాంగ్రెస్‌లోనూ దాదాపు అన్ని వార్డులకూ పోటీ గట్టిగానే ఉంది. ఒక్కో వార్డుకూ ఇద్దరు, ముగ్గురు చొప్పున పోటీపడ్డారు. కాంగ్రెస్‌లో అసమ్మతి పెద్దగా లేనప్పటికీ... జడ్చర్ల, అచ్చంపేట పురఎన్నికలను అక్కడి నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.