తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరేళ్లలో కేసీఆర్ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని తెతెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌రెడ్డి మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌పై మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్ట్‌లనే పూర్తి చేసి చూపించారని ఎద్దేవా చేశారు.
పాలమూరులో కరవు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు లాభం చేకూర్చే విధంగా రెండేళ్లలో పూర్తి చేసేందుకు పాలమూరు - రంగారెడ్డి పథకంను ప్రారంభించినా.. నేటికి పనులలో పురోగతి లేదని దయాకర్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి పథకంలో అంతరాష్ట్ర వివాధాలు తలెత్తే పరిస్థితి ఉందని.. జూరాల నుంచి చేపట్టాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు.