తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరు జిల్లాలో మరో జాతీయ రహదారి విస్తరణ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నుంచి కర్ణాటక దేవసూగూర్ వరకూ 167వ నెంబర్ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. భారత్ మాల పథకం కింద సుమారు 2వేల197 కోట్ల అంచనాతో శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు భూసేకరణ కోసం ప్రకటన విడుదల చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

Another national highway expansion in Palamuru district
పాలమూరు జిల్లాలో మరో జాతీయ రహదారి విస్తరణ

By

Published : Jan 1, 2021, 9:03 AM IST

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నుంచి రాయచూర్ వెళ్లే 167వ నెంబర్ జాతీయ రహదారిని భారత్ మాల పథకం కింద విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి భూసేకరణ కోసం త్వరలోనే ప్రకటన విడుదల చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ- ఎన్​హెచ్ఏఐ... డీపీఆర్​ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. జడ్చర్ల నుంచి దేవసూగూర్‌ వరకూ ప్రస్తుతం 30మీటర్లున్న రహదారిని 60 మీటర్ల మేర విస్తరించి... 4చోట్ల బైపాస్‌లు ఏర్పాటు చేయనున్నారు. భారత్ మాల పథకం కింద జడ్చర్ల- రాయచూర్ రహదారిని విస్తరించాలని 2017 లోనే సర్వే పూర్తైనా... అభ్యంతరాలు రావడంతో ప్రతిపాదనల దశలోనే విస్తరణ ఆగిపోయింది.

పాలమూరు జిల్లాలో మరో జాతీయ రహదారి విస్తరణ

13.5 కిమీ మేర మహబూబ్​నగర్ బైపాస్

జడ్చర్ల నుంచి దేవసూగూరు వరకూ మొత్తం 89.98 కిలోమీటర్ల పొడవుతో రహదారి విస్తరణను చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల నుంచి మరికల్ వరకు 44.41 కిలోమీటర్లు, నారాయణపేట జిల్లాలో మరికల్ నుంచి కర్ణాటకలోని దేవసూగూరు వరకూ 45.57 కిలోమీటర్ల మేర విస్తరణ జరగనుంది. రహదారి విస్తరణ, నిర్మాణ పనుల కోసం 1780 కోట్లు, భూసేకరణ కోసం 417 కోట్లు... మొత్తం 2వేల197 కోట్లతో పనులు చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని 17 చొప్పున గ్రామాలనుంచి రహదారి వెళ్లనుంది. మహబూబ్‌నగర్, మరికల్, మక్తల్, మాగనూరు వద్ద బైపాస్‌లు ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో అన్నింటికన్నా పొడవుగా మహబూబ్‌నగర్ బైపాస్‌ను 13.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. విస్తరణ కోసం మహబూబ్‌నగర్ జిల్లాలో 225.61 హెక్టార్లు, నారాయణపేట జిల్లాలో సుమారు 200 హెక్టార్ల భూముల్ని సేకరించనున్నారు.

రాయచూర్​కు రాకపోకలు సులభం

నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లా వాసులకు కర్ణాటకలోని రాయచూర్‌తో సంబంధాలు ఎక్కువ. వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య అవసరాల కోసం రెండు జిల్లాల నుంచి రాయచూర్‌కు నిత్యం రాకపోకలు కొనసాగుతుంటాయి. మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఆసుపత్రులు, ధాన్యం అమ్ముకునేందుకు... నారాయణపేట కంటే రాయచూర్‌కే అధికంగా వెళ్తుంటారు. రహదారిని విస్తరించి బైపాస్‌లు ఏర్పాటు చేస్తే హైదరాబాద్-రాయచూర్ సహా నారాయణపేట-మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి రాయచూర్‌కు రాకపోకలు మరింత సులభం కానున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వె‌ల్లడించారు.

ఈ రహదారి విస్తరణ కోసం సేకరించాల్సిన భూముల్లో బైపాస్‌ల నిర్మాణం కోసం సేకరించాల్సిన భూములే అధికంగా ఉన్నాయి. మిగిలిన చోట్ల 30 మీటర్లున్న రహాదారి వెడల్పును 60 మీటర్లకు మాత్రం పెంచనున్నారు.

ABOUT THE AUTHOR

...view details