తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ బొటానికల్ గార్డెన్' ఇక్కడ అన్ని రకాల మొక్కలుండును! - Telangana Botanical Garden news

తెలంగాణ బొటానికల్ గార్డెన్. తెలంగాణ మ్యాప్​ ఆకృతిలో ఒక్కో జిల్లాకు ఒక్కో రకమైన మొక్కలతో 33 జిల్లాల ఆకారంలో రూపుదిద్దుకుంటున్న ఉద్యానవనం. అరుదైన, అంతరించిపోతున్న, స్థానిక మొక్కల్ని ఒకేచోటకు చేర్చేందుకు జరుగుతున్న ప్రయత్నం. నల్లమల, శేషాచలం, పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపించే అటవీజాతులు, దేశ విదేశాల్లో కొన్నిప్రాంతాలకే ప్రత్యేకమైన మొక్కలన్నీ ఇక్కడ ఒకేచోట దర్శనమిస్తాయి. ఏడాది కాలంలో 450 రకాల 2,500 మొక్కలు కొలువుదీరాయి. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో శరవేగంగా రూపు దిద్దుకుంటున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్​పై ఈటీవీ భారత్ కథనం.

Telangana
తెలంగాణ

By

Published : Jul 17, 2021, 8:38 PM IST

Updated : Jul 17, 2021, 9:02 PM IST

'తెలంగాణ బొటానికల్ గార్డెన్' ఇక్కడ అన్ని రకాల మొక్కలుండును!

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల బీఆర్​ఆర్ (BRR) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ఆకృతిలో తెలంగాణ బొటానికల్ గార్డెన్ (Telangana Botanical Garden) శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) గతేడాది బొటానికల్ గార్డెన్ కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులు మార్చిలో విడుదలయ్యాయి. ఈ మేరకు గార్డెన్​లో పనులు ఊపందుకున్నాయి. ఒక్కో జిల్లాకు ఒక్కో రకమైన మొక్కలు నాటి అక్కడి ప్రాంత సంస్కృతి, చరిత్ర, ప్రత్యేకతను చెప్పేలా తెలంగాణ ఆకృతిలో గార్డెన్​కు రూపకల్పన చేయడం ఈ ఉద్యావనం ప్రత్యేకత.

ప్రత్యేకతను చాటేలా...

ఇప్పటికి 22 జిల్లాల్లో వేర్వేరు మొక్కల్ని నాటారు. మహబూబ్​నగర్ జిల్లాలో పిల్లలమర్రి ప్రత్యేకతను చాటుతూ మర్రి, రావి, జువ్వి, కొండ జువ్వి, కొండ రావి, బండ జువ్వి, తీగమర్రి లాంటి 23రకాల మొక్కలు నాటారు. దక్షిణ భారతంలో 23 మర్రి జాతులున్న గార్డెన్ ఇదొక్కటే. గద్వాల్ జిల్లాలో రాశీవనం, వనపర్తి జిల్లాలో పవిత్రవనం, నాగర్​కర్నూల్ జిల్లాలో ఔషధ గుణాలున్న 130 జాతుల అటవీ మొక్కలు, నారాయణపేట జిల్లాలో సీతాకోక చిలుకలవనం, వికారాబాద్ జిల్లాలో అలంకరణ మొక్కలు, సంగారెడ్డిలో కార్తీక వనం ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన మొక్కలు నాటారు. ఏడాది కాలంలో 450 రకాలకు చెందిన 2,500 మొక్కల్ని పెంచినట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అపియా చిన్నమ్మ వెల్లడించారు.

ఒకే దగ్గర అన్ని...

నల్లమల, పశ్చిమ కనుమలు, శేషాచలం అడవులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో అరుదుగా కనిపించే మొక్కలు, అంతరించిపోతున్న జాతులు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేకమైన మొక్కలు అన్నింటినీ ఒకే దగ్గరకు చేర్చడం బొటానికల్ గార్డెన్ ప్రత్యేకత. లాగాన్, ఎగ్ ఫ్రూట్, లిటీచి, అవకాడో, పీచ్ లాంటి ఇతర దేశాల్లో విరివిగా పండే మొక్కలు సైతం ఇక్కడ కనిపిస్తాయి. చాలా అరుదైన వివృతబీజాల 7 జాతులు, అంతరించిన పోతున్న గాలిబుడగ, అడవి ఉల్లి, ఆంధ్రోగ్రఫీస్ లాంటి మొక్కలు అక్కడ ఉన్నాయి.

ఎడారి మొక్కల సంరక్షణ...

ఎడారి మొక్కల్ని సైతం సంరక్షిస్తున్నారు. వృక్షశాస్త్రంలో డిగ్రీ, పీజీ చేసే విద్యార్థులు అధ్యయనం కోసం ఎక్కడికో అడవులు, ప్రాంతాలకు వెళ్లకుండా ఒకేచోట వీటిని అందుబాటులో ఉంచనున్నారు. మొక్కల సమాచారాన్ని తెలిపేలా క్యూఆర్ కోడ్ విధానం అమలు చేస్తున్నారు. జీవవైవిద్యాన్ని చాటేందుకు పక్షులు, జంతువులను ఆకర్షించేందుకు ఇప్పటికే కొర్రలు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న వేరుశనగ లాంటి పంటల్ని పండిస్తున్నారు. పూలకోసం సీతాకోక చిలుకలు, ఆహారం కోసం అందమైన పక్షులు, జంతువులు గార్జెన్​లో సందడి చేస్తున్నాయి. పుట్టిన రోజులు, పెళ్లి రోజులు ముఖ్యమైన దినాల్లో కొందరు తమకు గుర్తుగా మొక్కలు నాటి వెళ్తున్నారు.

అందుబాటులోకి...

మంజూరైన రూ.50 లక్షల్లో ఏడాదిలో సుమారు రూ.10 లక్షల వరకూ ఖర్చు చేసినట్లుగా వృక్షశాస్త్ర సహాయ ఆచార్యుడు సదాశివయ్య తెలిపారు. గార్డెన్​కు ముఖద్వారం చుట్టు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. నిర్వాహణ కోసం పరికరాల్ని కొనుగోలు చేశారు. నీటి నిల్వ కోసం రాతితో కుంట నిర్మాణం చేసి డ్రిప్ ఇరిగేషన్ మొక్కలకు నీరందిస్తున్నారు. మొక్కల సేకరణ సంరక్షణ కోసం పరిశోధక విద్యార్థి సహా ఇద్దరు వన సంరక్షకులను నియమించారు.

అన్నిజిల్లాల సరిహద్దుల్ని రెండడుగుల వెడల్పతో దారి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బొటానికల్ గార్డెన్​కు అనుబంధంగా 600 వృక్షజాతుల మొక్కలతో కేసీఆర్ ఆర్బోరేటమ్ ఏర్పాటు చేయనునన్నట్లు సదాశివయ్య వెల్లడించారు. పరిశోధన కోసం ప్రయోగశాలను సైతం ఏడాదిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

చూడాలంటే వెళ్లాల్సిందే...

ఎక్కడా, ఎప్పుడు కనిపించని మొక్కల్నీ ఒకేచోట దర్శమిస్తుండటంతో ఎంతో మంది ప్రస్తుతం ఈ గార్జెన్​ను సందర్శిస్తున్నారు. వచ్చే ఏడాదిలో మరో 2 వేల మొక్కల్ని నాటి సంరక్షించాలని కళాశాల లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం గార్డెన్​లో 600లకు పైగా రకాలు 3,500లకు పైగా మొక్కలు ఉన్నాయి. చూడాలనుకుంటే జడ్చర్లకు వెళ్లాల్సిందే.

ఇదీ చదవండి: OIL PALM: '20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళికలు'

Last Updated : Jul 17, 2021, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details