తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2021, 7:29 PM IST

ETV Bharat / state

మాతృమూర్తికి వందనం.. బిడ్డ వైకల్యాన్ని ఓడించింది!

మానసికంగా, శారీరకంగా దివ్యాంగులైన పిల్లలు పుడితే.. తల్లిదండ్రులకు తీరని వేదన. సమాజంలో వారి మనుగడ, భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన. మానసిక ఎదుగుదల లేని కూతురుని చూసి ఒకప్పుడు ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కానీ సవాళ్లను ఎదుర్కొంటూ... కూతుర్ని తన కాళ్లమీద తాను నిలబడేలా తీర్చిదిద్దింది. చదువును మాన్పించి జీవన నైపుణ్యాలను నేర్పింది. లోపాన్ని కనిపించకుండా పెంచి... సాధారణ యువతులకు దీటుగా నిలబెట్టింది. కూతురు కోసం ఓ తల్లి 20 ఏళ్లుగా పడుతున్న శ్రమపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

mother effort on her daughter, special efforts on handicapped kid
మాతృమూర్తికి వందనం, దివ్యాంగురాలైన బిడ్డ కోసం అమ్మ కృషి

మాతృమూర్తికి వందనం

దివ్యాంగులైన పిల్లలు పుడితే ఎంతోమంది తల్లిదండ్రులు కుంగిపోతారు. ఆ చిన్నారులను పుట్టినప్పటి నుంచే నిర్లక్ష్యం చేస్తారు. అలా దివ్యాంగ పిల్లలపై ఇంటినుంచే వివక్ష మొదలవుతుంది. అయితే అందరూ అలా ఉండరు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ మాతృమూర్తి. దివ్యాంగురాలైన తన బిడ్డను సాధారణ యువతులకు దీటుగా తీర్చిదిద్దింది. ఆ ప్రత్యేకమైన పెంపకంలో ఆ తల్లి అనుభవాలేంటో తెలుసుకుందాం రండి...

ఎనలేని కృషి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం టీచర్స్ కాలనీలో నివాసముండే సుభాషిణి-యాదగిరిల కుమార్తె యశస్విని. అరుదైన మానసికస్థితితో జన్మించిన యశస్విని పరిస్థితి తెలిసి ఆ తల్లిదండ్రులు కుంగిపోయారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం యశస్విని ఇతరులతో పోల్చితే చాలా చురుకైన యువతి. సొంత పనులు చేసుకోవడమే కాకుండా... బ్యూటీపార్లర్ సైతం నిర్వహిస్తోంది. మానసిక ఎదుగుదల లేని అమ్మాయి.. ఇవాళ సాధారణ యువతిగా మారడం వెనుక ఆమె తల్లి కృషి ఎంతో ఉంది. ఇలాంటివారిని స్వయంగా ఎదిగేలా కృషి చేయాలని సుభాషిణి చెబుతోంది.

ప్రత్యేక శ్రద్ధ

యశస్విని పుట్టిన సమయానికి తల్లి సుభాషిణికి 17 ఏళ్లు మాత్రమే. ఇంట్లోనే ఉంటూ చదువుకుంటూ... అంచెలంచెలుగా ఎదిగి... ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా చేస్తోంది. కూతురు మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు ఎమ్మెస్సీ సైకాలజీ చేసింది. ఉద్యోగంలో తీరికలేకపోయినా ఎన్నడూ బిడ్డను మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. 5 తరగతి వరకు చదివించి తర్వాత మాన్పించేసింది. అప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధతో జీవన నైపుణ్యాలను ఒక్కక్కటిగా నేర్పించింది. ఒకరిపై ఆధారపడకుండా, తన కాళ్లపై తాను నిలబడేలా అనేక అంశాలపై శిక్షణ అందించింది.

'దివ్యాంగులైన బిడ్డలను ప్రత్యేకంగా చూడకుండా సమాజంలో కలిసిపోయేలా చూడాలి. పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహిస్తే వారిలో తప్పక మార్పు గమనించవచ్చు. ప్రత్యేక పిల్లల పట్ల సమాజం చూపే వివక్ష, జాలి పట్టించుకోకుండా శ్రద్ధ చూపగలిగితే మంచివారిగా తీర్చిదిద్దవచ్చు.'

-సుభాషిణి, యశస్విని తల్లి

యశస్విని చాలా చురుకైన యువతి అని... ఆమెను చూస్తే ఎవరూ మానసిక దివ్యాంగురాలు అని గుర్తించరని స్థానికులు చెబుతున్నారు. ఇందులో ఆ మాతృమూర్తి కృషి ఎనలేనిదని అంటున్నారు.

'మానసిక, శారీరక దివ్యాంగులు అనగానే హస్టళ్లు, ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించకూడదు. వారికి స్వేచ్ఛ, ప్రోత్సాహం, తగిన శిక్షణ ఇస్తే వాళ్లూ సాధారణ పిల్లల్లా మారుతారు. జీవితంలో స్థిరపడేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయాలి.

-యశస్విని

పుట్టిన బిడ్డ మానసిక వికలాంగురాలైనా కుంగిపోకుండా.. ఆమెను సాధారణ యువతిగా మార్చడంలో సుభాషిణి పాత్ర ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ప్రోత్సాహం ఉంటే వైకల్యాన్ని జయించి నిలబడవచ్చని చెప్పడానికి యశస్విని ఓ ప్రేరణ.

ఇదీ చదవండి:సింగరేణి ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పదవీవిరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగం

ABOUT THE AUTHOR

...view details