పోలేపల్లి సెజ్‌లో పరిశ్రమలకు దెబ్బ... నిబంధనల ఉల్లంఘనే కారణం! మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో కాలుష్య కారక పరిశ్రమలు.. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాల్సిన పర్యావరణ పరిహారం పెరగనుంది. హారిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు గతంలో నిబంధనలు ఉల్లంఘించిన 8 పరిశ్రమలకు 365 రోజలకు ఒక్కో పరిశ్రమ రూ. 18లక్షల 25వేలు, మరో పరిశ్రమ 6 నెలలకు రూ. 9 లక్షలు చెల్లించాలని పీసీబీ ఈనెల 5న ఆదేశాలు జారీ చేసింది.
కఠిన చర్యలు...
జనవరి 15న జరిగిన విచారణలో హరిత ట్రైబ్యునల్ గుర్తించిన అన్నిఉల్లంఘన రోజులనూ పరిగణలోకి తీసుకోవాలని తీర్పునిచ్చింది. పరిహారం చెల్లించకపోయినా, నిబంధనల ఉల్లంఘన కొనసాగినా ఆ పరిశ్రమలను మూసివేయడం సహా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పీసీబీ ఆదేశాలు...
నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమల నుంచి పొల్యూటర్ పే నిబంధన కింద పర్యావరణ పరిహారాన్ని వసూలు చేయాలని గతంలో ట్రైబ్యునల్ తెలంగాణ పీసీబీని ఆదేశించింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలకు ఉపక్రమించింది. పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘించిన రోజులను లెక్కించి పరిహారాన్ని అంచనా వేసింది.
పరిగణలోకి అన్ని రోజులు...
హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం నివేదిక ప్రకారం ఒక్కో పరిశ్రమ కనిష్టంగా 540రోజుల నుంచి గరిష్టంగా 1,329 రోజుల వరకు నిబంధనలు ఉల్లంఘించినట్లుగా గుర్తించింది. జనవరి 15న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సమర్పించిన నివేదికపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ నిబంధనల ఉల్లంఘన జరిగిన అన్నిరోజులను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ట్రైబ్యునల్ తీర్పుతో ఒక్కో పరిశ్రమ పర్యావరణ పరిహారం చెల్లించాల్సిన ఉల్లంఘన రోజులు, చెల్లించాల్సిన పరిహారం భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రాంతీయ కార్యాలయం నివేదించిన ప్రకారం మొత్తం 9 పరిశ్రమల యాజమాన్యాలు రూ. 4 కోట్ల 42 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు...
ట్రైబ్యునల్ తీర్పు అమలుపై హైదరాబాద్ జోనల్ కార్యాలయం జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ కృపానందంను సంప్రదించగా.. హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘన జరిగిన అన్నిరోజులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. గడువు లోపు పరిహారం చెల్లించకపోతే ఆ పరిశ్రమలకు మూసివేత ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు.