వాళ్లంతా ఒకే ఊరోళ్లు... తెల్లారి లేస్తే పిన్ని.. అక్క... చెల్లి అంటూ పలకరించుకుంటూ ఉండేవాళ్లు... ఊర్లో పనిలేదంటే పక్క ఊర్లో నాలుగు డబ్బులొస్తున్నాయని ఆటో కట్టించుకుని పనికెళ్లారు. పని ముగించుకుని తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. 18 మంది కిక్కిరిసి కూర్చున్నా వారి ఊసుల్లో ఇరుకనిపించలేదు. ఎప్పుడు ఇంటికి వెళ్తామా అన్న ఆలోచనే. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తున్నారు తొందరగా వెళ్లయ్యా అంటూ అడుగుతోంది ఓ చంటి బిడ్డ తల్లి. బడికెళ్లిన పిల్లలు వచ్చేస్తారని... ఇంట్లో పెద్ద వాళ్లకు వండి పెట్టాలి.. డ్రైవరన్నా తొందరగా వెళ్లు అంటున్నారు ఇంకొకళ్లు.. రేపు పనెక్కడో అంటూ ఊసులు చెప్పుకుంటూ వస్తున్నారు మిగతా వాళ్లు.
ఇంతలో ఊహించని ప్రమాదం వారి జీవితాలను బలిగొంది. ఎదురుగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంటి దగ్గర తమ వాళ్లను తలచుకుని ఎలాగైనా తమను బతికించండి అంటూ వాళ్లు చూసిన చూపులు చూపరులచే అశృధారలు కురుపించింది. ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది.