విద్యార్థుల ఉద్యమాలు.. ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగలో చేపట్టిన నిరుద్యోగ నిరాహారదీక్షను ఆమె విరమించారు.
ఈ సందర్భంగా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత, నిరుద్యోగులు ఆశ పడ్డారని షర్మిల పేర్కొన్నారు. పాలన చేతకాని వారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ తన ఇంట్లో వారికి 5 ఉద్యోగాలు ఇచ్చారని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
కొంతమంది మంత్రులు నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటని కొంతమంది మంత్రులు అంటున్నారని షర్మిల అన్నారు. 5, 6 తరగతులు చదవని వారు మంత్రులుగా పని చేస్తుంటే.. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు హమాలీ పనులు చేయాలా అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గొర్రెలు, చేపలు పెంచుకోవాలనడం తగదని హెచ్చరించారు. అంతకుముందు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్ కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించారు. ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సునీల్ కుటుంబానికి ప్రభుత్వం ఇస్తామన్న రూ.5 లక్షలు, ఉద్యోగం, డబుల్ బెడ్ రూంలను ఇంత వరకూ ఇవ్వలేదని షర్మిల గుర్తు చేశారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
మా రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు, యువత మోసపోయారు. నోటిఫికేషన్లు రేపిస్తాం, మాపిస్తాం అంటూ ప్రభుత్వం ఏళ్లుగా నిరుద్యోగులను మోసం చేస్తోంది. సమాజంలో తలెత్తుకు తిరగలేక, తల్లిదండ్రులకు భారం కాలేక ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినా కేసీఆర్‌లో చలనం లేదు. షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు