YS Sharmila On Paddy Procurement: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేతకాకపోతే సీఎం కేసీఆర్.. రాజీనామా చేయాలని వైఎస్సార్టీపీ అధినేత షర్మిల డిమాండ్ చేశారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబాబాద్ జిల్లాలో చేరి.. గార్ల మండలం పుల్లూరు మీదుగా సాగింది. యాసంగిలో రైతులు పండించిన మొత్తం వరి ధాన్యాన్ని సీఎం కేసీఆర్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతులతో కలిసి షర్మిల దీక్ష చేపట్టారు. వానాకాలంలో 52 లక్షల ఎకరాల్లో వరి వేస్తే యాసంగిలో కేవలం 35 లక్షల ఎకరాల్లోనే వరి వేశారన్న షర్మిల.. అందులో పండిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదా..? అని ప్రశ్నించారు.
"బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ సంతకం చేయబట్టే కేంద్రం కొనుగోలు చేయడం లేదు. ఎవరిని అడిగి సంతకం చేశారు..? ఒక్క సంతకం చేసి రైతులను బావిలోకి తోశారు. మళ్లీ రక్షించమని కేంద్రాన్ని వేడుకుంటున్నారు. కేంద్రం మీదే ధర్నా చేస్తారట..! వడ్ల కొనుగోలుకు పైసలు లేవు కానీ.. కాళేశ్వరానికి, నూతన సచివాలయం కట్టేందుకు పైసలు వస్తాయా..? ఈ రోజు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రమని గొప్పలు చెప్తున్న తెరాస ప్రభుత్వం.. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, నష్టపోయిన పంటలకు పరిహారం, మహిళల రుణాల వడ్డీ మాఫీ, ఉద్యోగుల జీతాలకు మాత్రం మొండి చేయి చూపిస్తోంది." - షర్మిల, వైఎస్సార్టీపీ అధినేత