తెలంగాణ

telangana

ETV Bharat / state

'యువతికి న్యాయం చేయాలి.. కేసు సుమోటోగా తీసుకోవాలి' - Youth rally at peddamupparam news

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దాముప్పారంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతికి న్యాయం చేయాలంటూ స్థానిక యువత ర్యాలీ నిర్వహించారు. ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని హెచ్​ఆర్సీని కోరారు.

peddamupparam
peddamupparam

By

Published : Mar 18, 2022, 12:29 AM IST

'యువతికి న్యాయం చేయాలి.. కేసు సుమోటోగా తీసుకోవాలి'

మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారంలో గ్రామ యువకులు ర్యాలీ నిర్వహించారు. ఇటీవల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువతికి న్యాయం చేయాలంటూ గ్రామ యువత కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ప్రేమించిన యువకుడి చేతిలో మోసపోయిన సూసైడ్ చేసుకున్న యువతికి న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేశారు. యువతి విషయంలో న్యాయం చేయలేని సర్పంచ్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. గ్రామ వీధుల్లో కలియతిరుగుతూ సర్పంచ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చనిపోయిన యువతికి న్యాయం జరగాలని నినదించారు. ఈ కేసును హెచ్​ఆర్సీ సుమోటోగా తీసుకోవాలని కోరారు.

మంగళవారం యువతి ఆత్మహత్య...

అమ్మా... నాన్నా మళ్లీ మీ ముందు ఓడిపోయా... అందరి ముందూ ప్రశ్నగా మిగిలిపోయా...పెద్దమనుషుల సమక్షంలో మళ్లీ ఆర్నెల్లు గడువు పెడితే తనను నమ్మి మరోసారి ఓడిపోయా.. ఏం చేయాలో అర్థంకాట్లేదు... నాకు బతకాలని లేదు’ అంటూ లేఖ రాసి యువతి ఉరేసుకుని మంగళవారం రోజు ఆత్మహత్యకు పాల్పడింది.

మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దముప్పారం గ్రామానికి చెందిన పోలెపల్లి వెంకన్న-శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె శరణ్య(22) ఇంటర్మీడియెట్‌ చదివారు. కుట్టుమిషన్‌ నేర్చుకుని ఇంటి వద్దే ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమించింది. ఆ యువకుడు ఓ పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ, కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి చేసుకునే క్రమంలో వీరి మధ్య సమస్య తలెత్తింది. దీంతో ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఆ యువకుడు పెళ్లి చేసుకునేందుకు మరో ఆరునెలలు గడువు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.

యువకుడి చిత్రం గీసి...

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రేమించి మోసపోయి... ఓడిపోయానంటూ సదరు యువకుడి ఊహాచిత్రాన్ని గీసి లేఖ రాసిపెట్టింది. ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లేఖను, ఆత్మహత్యకు వినియోగించిన చున్నీని స్వాధీనం చేసుకున్నారు.

యువకుడి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన

యువతి మృతికి ప్రేమించిన యువకుడే కారణమంటూ, బాధిత కుటుంబానికి న్యాయం చేసి బాధ్యుడైన యువకుడిని కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. యువతి మృతిపై తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడి బొమ్మగీసి..

ABOUT THE AUTHOR

...view details