తెలంగాణ తల్లి.. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తానని చెప్పి ఏడేళ్లు అవుతున్నా... ఇంత వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లోనే 10ఎకరాల్లో భవంతి కట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, భూ మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా వర్ధన్నపేటలో ప్రజలను ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించారు.
వర్ధన్నపేటలో కిషన్ రెడ్డి చెప్పుతో సమానమన్నారు
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఓటు హక్కుతో కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తే ఈ పదవి చెప్పుతో సమానం అన్నారు. కేసీఆర్ను గద్దె దించి... తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం. -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
బడుగు వర్గాల వారే అధికం
పొదుపు సంఘాలకు అప్పులు ఇచ్చేది ప్రధాని నరేంద్రమోదీ అని.. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. కేసీఆర్ కనీసం పావలా వడ్డీ కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. నూతనంగా నియమాకం అయిన కేంద్రమంత్రులను పార్లమెంటు సభల్లో పరిచయం చేస్తుంటే కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. 74మంది కేంద్ర మంత్రుల్లో 52మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని స్పష్టం చేశారు.
ముందున్నాం..
ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనాను సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే ముందున్నామని కిషన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ ముందంజలో ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 57కోట్ల మందికి వ్యాక్సిన్ అందించామని వివరించారు. కరోనా టీకాను దేశంలోని చివరి వ్యక్తి వరకు ఉచితంగా అందిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి:Union Minister Kishan reddy : 'ఏడేళ్లలో కేసీఆర్.. రాష్ట్రాన్ని దివాళా తీశారు'