Turmeric price: రైతులు మద్దతు ధర రాకపోతే కాస్త అటుఇటు అయినా చేతికి వచ్చిన పంటని అమ్మేస్తారు. లాభం రాకున్న పెట్టబడులు వస్తే చాలని అనుకుంటారు . కానీ ఓ అన్నదాత సంవత్సరాలుగా పండించిన పసుపుకు గిట్టుబాటు ధర రావడం ఇంట్లోనే నిల్వ ఉంచుతున్నాడు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం గ్రామానికి చెందిన రైతు కాటం రాంరెడ్డి. తాను పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గత 6 ఏళ్లుగా సుమారు 120 క్వింటాల పసుపును నిల్వ చేస్తున్నారు.
మంచి ధర వస్తేగానీ అమ్మను:ఇందుకోసం పంటను ఒక గదిలో నిల్వ ఉంచి గదిలోకి గాలి వెళ్లకుండా తలుపులను పూర్తిగా వార్తాపత్రికలతో కప్పేశాడు. పసుపు ధర ఎప్పుడైతే క్వింటాకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు చేరితే అప్పుడే అమ్మేందుకు ఎదురు చూస్తున్నాడు. కానీ ధర కాస్తా రూ.5,000 నుంచి రూ.8,000 మధ్యనే పలుకుతోంది. ఈ ధరకు పసుపును విక్రయిస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాదని రాంరెడ్డి వాపోతున్నాడు. ఇంకా నిల్వ చేసిన పసుపుకు పురుగు పట్టకుండా ఉండేందుకు రసాయన బిల్లలను పసుపు బస్తాల మధ్య వేస్తున్నట్టు అందుకోసం దాదాపు నెలకు రూ. 3000 ఖర్చు చేస్తున్నట్టు తెలిపాడు.
గిట్టుబాటు ధర రాక 15 టన్నుల పసుపును నిల్వ: మహబూబబాద్ మండలం సింగారం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా గిట్టుబాటు ధర రావడం లేదని 15 టన్నుల పసుపును నిల్వ ఉంచుతున్నారు. ఇలా చాలా మంది రైతులు పసుపుకు అధిక గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో జిల్లాలోని రైతుశీల గిడ్డంగులలో పసుపును భద్రపరిచారు. ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని, క్వింట పసుపుకు రూ.12,000 ధర ఉండేలా చేసి పసుపు రైతులని ఆదుకోవాలని కోరారు.