TRS Bayyaram Protest: సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాలను ఏలుతారనే ఆక్రోశంతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో తెరాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఉక్కు నిరసన దీక్ష ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరై గులాబీ నాయకులతో దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, రాములు నాయక్, శంకర్ నాయక్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఆందోళన చేస్తామని కాంగ్రెస్ చెప్పడం సిగ్గుచేటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండి 70 ఏళ్లు పట్టించుకోలేదని ఆరోపించారు. భాజపా ఎంపీలు రాజీనామా చేసే వరకు వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. విభజన చట్టంలో కల్పించిన హక్కు బయ్యారం ఉక్కు పరిశ్రమ అని ఉద్ఘాటించారు. భాజపా ఎంపీలకు మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ హక్కులు కాల రాసేలా కేంద్రం ప్రవర్తిస్తోందన్నారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెబితే రాజీనామా చేస్తా సవాల్ విసిరారు. దేశంలో అన్ని పార్టీలను ఏకం చేసి భాజపాను తరిమేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారని వివరించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం... దిల్లీ స్థాయిలో ఆందోళన చేపడతామన్నారు.
విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రస్తావన ఉంది. ఉక్కు పరిశ్రమ తెచ్చే వరకు భాజపా నేతలను వదిలేది లేదు. రాష్ట్ర ప్రభుత్వ హక్కులు కాలరాసేలా కేంద్రం వ్యవహారం ఉంది. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెబితే రాజీనామా చేస్తా. మతాలు, కులాల పేరిట ఓట్లు పొందడమే భాజపా ఉద్దేశం. ఉక్కు పరిశ్రమ కోసం జాతీయ స్థాయిలో ఆందోళన చేస్తాం.