TRS on Bayyaram Steel Plant : తెలంగాణపై భాజపాకి కక్ష ఉన్నందునే అభివృద్ధికి సహకారం అందించడంలేదని తెరాస ఎంపీలు ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను సైతం కేంద్రం అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, మాలోత్ కవిత, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు.
ఫ్యాక్టరీ తెస్తే దండేసి దండంపెడతాం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కు పరిశ్రమ తెచ్చి ఆ క్రెడిట్‌ను మీరే తీసుకోవాలని నామ నాగేశ్వర్‌రావు అన్నారు. తెలంగాణకు బయ్యారం ఫ్యాక్టరీ తెస్తే దండేసి దండంపెడతామన్నారు. బయ్యారం ఉక్కు అంశంపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను రాబోయే పార్లమెంట్‌లో లెవనెత్తుతామని నామ వెల్లడించారు. కేంద్రం వద్ద ఉన్న అధికారాలు రాష్ట్రానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తుందన్నారు. చట్టం మార్పులు చేసి కొత్త యాక్టు తీసుకువచ్చి రాష్ట్రాలకు హక్కులివ్వాలని డిమాండ్ చేశారు.
'పథకాల అమలులో తెలంగాణపట్ల కేంద్రం వివక్ష చూపుతోంది. రాష్ట్రంలో మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నాం. రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీకొట్టి హర్‌ఘర్ జల్ ప్రవేశ పెట్టింది. ఇంటింటికీ నీటి పథకం కింద కేంద్రం నుంచి 50 శాతం నిధులు రావాలి. నీతిఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదు. మిగతా రాష్ట్రాలకు మాత్రం కేంద్రం నిధులు ఇస్తోంది.' - నామ నాగేశ్వరరావు, తెరాస లోక్‌సభ పక్షనేత