మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండా సమీపంలోని గుట్టల్లో రక్తపుమడుగులో ఇంటర్ విద్యార్థిని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి ఇంటి నుంచి కిరాణా దుకాణానికి అని వెళ్లింది. గంటసేపటి తర్వాత గుట్టల్లో అచేతనంగా పడి ఉందని ఓ వ్యక్తి తండావాసులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు, స్థానికులు వెళ్లి చూడగా యువతి మృతదేహం కనిపించింది. వెంటనే మరిపెడ పోలీసులకు సమాచారం అందించారు. తన కుమార్తెను తండా ధర్మారంకు చెందిన ధరమ్ సోతు రాజేష్ అనే యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి ఆరోపించారు. ఇంటర్ విద్యార్థిని మృతితో సీతారాం తండాలో విషాధచాయలు అలుముకున్నాయి.
గిరిజన యువతిపై అత్యాచారం... హత్య - మహబూబాబాద్ తాజా క్రైమ్ వార్తలు
మహబూబాబాద్ జిల్లాలో గిరిజన యువతిపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. కిరాణ దుకాణానికి అని వెళ్లిన యువతిని గుట్టల్లోకి తీసుకెళ్లి పాశవికంగా హత్య చేశారు. హత్యాచార ఉదంతంపై మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గిరిజన విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యం, హత్యపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. నేరస్థుడిని వెంటనే పట్టుకొని.. శిక్షించాలని జిల్లా ఎస్పీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి దారుణాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని, బాధిత కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇలాంటి దారుణాలు జరగకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు