తెలంగాణ ఏ విధంగా సాధించామో... ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే విధంగా విజయం సాధించాలని తెలంగాణా జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్. కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ట్రం ప్రతి రంగంలోనూ వెనుకబడి ఉందని అన్నారు. తెరాస ప్రభుత్వం 2013 జీఓను పక్కకు పెట్టి 2 లక్షల ఎకరాల భూమిని సేకరించిందని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన తెజస పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'ఖజానా కోసమే ఎల్ఆర్ఎస్'
ఫార్మాసిటీకి 2 నుంచి 3 వేల ఎకరాల భూమి అవసరం ఉంటే... ప్రజల నుంచి రూ.12లక్షల చొప్పున 20 వేల ఎకరాల భూమిని తీసుకొని రూ.1కోటి నుంచి కోటి 30 లక్షల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. కష్టపడి కొనుగోలు చేసిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ఖజానా నింపుకోవడం కోసమే ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చారని విమర్శించారు. మెగా కృష్ణా రెడ్డికి రూ.22 వేల కోట్లు చెల్లించేందుకు మూడో టీఎంసీని ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.