జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్పల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం... గ్రామస్థులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. నాలుగు రోజుల నుంచి వివిధ చోట్ల పులి అడుగు జాడలు అధికారులు గుర్తించారు. పత్తి చేలల్లోనూ పులి అడుగులు గుర్తించారు. నిమ్మగూడం సమీపంలో ఆవు కళేబరం, మరో చోట అడవి పందిని చంపిన ఆనవాళ్లు, పులి అడుగులు కనిపించాయి. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు అధికారులు నిర్ధరణకు వచ్చి... దాని కదలికలను తెలుసుకునేందుకు కెమెరాలు బిగించారు. గ్రామస్థులు ఒంటరిగా తిరగవద్దని, పులిని చంపేందుకు ఉచ్చులు, కరెంటు తీగలు పెట్టవద్దంటూ దండోరా వేశారు.
వరంగల్ పాకాల అటవీ ప్రాంతం, ఏటూరునాగారం అభయారణ్యం, మహాముత్తారం అటవీ ప్రాంతాలు... కొన్ని దశాబ్దాల క్రితం వరకూ పులులకు ఆవాసమనే చెప్పాలి. అడవులు నరికివేయడం, ఆహారం లభించకపోవడం వల్ల... ఈ ప్రాంతంలో పులుల జాడ లేకుండా పోయింది. మళ్లీ చాలా ఏళ్ల తరువాత... పులులు సంచరించడం అటవీ శాఖ అధికారులను ఆనందానికి గురి చేస్తోంది. ప్రభుత్వ చర్యలతో... అటవీ ప్రాంతం విస్తరించి, నీరు, ఆహారం సమృద్ధిగా దొరకటం వల్ల మళ్లీ పూర్వవైభం వస్తుందన్నారు. తెలంగాణ అటవీ ప్రాంతం ప్రస్తుతం పులులు ఆవాసానికి అనువుగా ఉందని చెబుతున్నారు.