మహబూబాబాద్ జిల్లా నలు దిక్కులా 20 రోజులుగా పులి సంచరిస్తోందని చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ (సీసీఎఫ్) వెంకట రాజారావు అన్నారు. గూడూరు మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013 నుంచి 2020 వరకు జిల్లాలో అడవుల శాతం పెరగడంతో పలు అడవి జంతువులు విస్తారంగా పెరిగాయని రాజారావు తెలిపారు. దీంతో పెద్ద పులి జిల్లాలోకి ప్రవేశించిందని చెప్పారు.
20 రోజుల పాటు జిల్లాలోని నలువైపులా తిరిగి పెద్దపులి ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుందని రాజారావు అన్నారు. ఇది చాలా శుభపరిణామమని, దాని ఆవాసాన్ని చెడగొట్టవద్దని వాటిని కాపాడటం మన అందరి బాధ్యత అని వివరించారు. జిల్లాలో ప్రవేశించిన పులి ఆడ పులి అని, ఇది సంతానోత్పత్తిని పెంచుకునేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే స్థిర పడుతుందని తెలిపారు. స్థానికులు మేకలను కాని మరే ఇతర జంతువులని కాని పులి కంటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తద్వారా అది అటవీ జంతువులను మాత్రమే వేటాడుతుందని చెప్పారు.