ఈ నెల 1న కొత్తగూడ మండలం రేన్యతండా సమీపంలోని అడవి నుంచి ఒక సాంబరు జింక చెరువులో నీళ్లు తాగడానికి రాగా వేటగాళ్లు గొడ్డలితో, కర్రలతో కొట్టారు. వన్యప్రాణిపై దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇలా వన్యప్రాణులను వేటాడటమే లక్ష్యంగా కొందరు వేటగాళ్లు కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం ప్రాంతంలోని అడవుల్లో ఉచ్చులు వేస్తూ వాటిని బలిగొంటున్నారు.
ఇలాంటి ప్రాంతాలను అటవీ శాఖ సిబ్బంది తరచూ సందర్శిస్తూ వేటగాళ్లను నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. అడవుల్లో అప్పుడప్పుడు నీళ్లు దొరక్కపోవడంతో పచ్చటి మేత లభించే ప్రదేశాలను, దాహం తీర్చే నీటిరేవులను వెతుక్కుంటూ జంతువులు వలసబాట పడుతున్నాయి. ఈ క్రమంలో అవి గ్రామాల్లోకి వస్తున్నాయి.
చట్టం చట్టుబండలు:
అడవి జంతువులను కాపాడేందుకు కల్పించిన చట్టాలు చట్టుబండలుగా మారాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని అధ్యాయం 3, సెక్షన్ 9 కింద అడవి జంతువులను వేటాడటం నిషేధం. జంతువులను వేటాడరాదని 11, 12 సెక్షన్లు వివరిస్తున్నాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు విధిస్తారు. నేరం చేసిన వారికి, అందుకు సహాకరించిన వారికి మూడు ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.25వేలు నగదు జరిమాన విధిస్తారు.
గత సంఘటనలు మచ్చుకు కొన్ని..
* 2018 జనవరిలో కొత్తగూడ మండలం కోనాపురంలో వేటాడిన అడవిపంది స్వాధీనం.
* 2017 మార్చిలో ఓటాయిలో అడవి పంది మాంసాన్ని గుర్తించి స్వాధీనం.
* 2014లో ఇదే మండలం చెరువు ముందుతండా అటవీప్రాంతంలో వేటగాడి ఉచ్చుకు బలైన కనుజు స్వాధీనం.