చుట్టూ పచ్చని చెట్లు... ఎత్తైన కొండల నడుమ వృథాగా ప్రవహించే వరద నీరు. ఆ నీటికి అడ్డుకట్ట వేసి... ఆయకట్టుకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో 16 ఏళ్ల కిందట తులారాం ప్రాజెక్టు నిర్మించారు. సాగునీటి కాలువలు నిర్మించారు. కానీ ఇప్పుడు ఆ కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నీరు సమృద్ధిగా ఉన్నా... వృథా అవుతూ ఆయకట్టులో కరవే సంభవిస్తోంది.
నీరున్న ఇబ్బందులే..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని వినోభానగర్ సమీపంలోని తులారాం ప్రాజెక్టు మరమ్మతులను నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వట్టేవాగుపై ప్రాజెక్టు నిర్మించాలని మహబూబాబాద్‌కు చెందిన బీఎన్ గుప్తా నాలుగు దశాబ్దాలు పోరాడారు. 2003లో నాటి ప్రభుత్వం రూ.11.50 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 2005లో పూర్తి చేశారు. 21 అడుగుల ఎత్తులో 0.50 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా ఆనకట్టను నిర్మించారు.
ఆయకట్టు సస్యశ్యామలం
ఈ ప్రాజెక్టుతో వినోభానగర్, గౌరారం, బాలజీపేట్, త్రీత్రీ తండా, బాల్యతండా, జగనాతండా, బండ్లకుంట గ్రామాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ఆనకట్ట కింద ఉన్న ఏడు గొలుసుకట్టు చెరువులు, కుంటలు నిండేలా 12 కిలోమీటర్ల మేర పంట కాలువలు నిర్మించారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
వృథాగా సాగునీరు
ఏటా ప్రాజెక్టులోకి సమృద్ధిగా నీరు చేరుతున్నా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించే పరిస్థితి లేదు. కాలువను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో సాగునీరు వృథా అవుతోంది. కొన్నిచోట్ల కాలువ అసంపూర్తిగా నిర్మించడం.. కాలువల్లో పేరుకుపోయిన పూడిక మట్టిని తొలగించకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. ప్రాజెక్టు సమీపంలోని నిర్మించిన సిమెంట్ కాలువకు రంధ్రాలు పడడం.. అక్కడక్కడ పగుళ్లు రావడం వల్ల నీరు వృథాగా పోతోంది. కొన్నిచోట్ల చెట్లపొదలతో కూరుకుపోయింది.