మహబూబాబాద్ జిల్లాలో గర్భిణీ స్త్రీలకు 80 శాతం మేర శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకు వీటి సంఖ్య తగ్గించి, సాధారణ కాన్పులు చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. దీనికోసం ప్రత్యేక వైద్య నిపుణుల(మిడ్ వైజ్ నర్సింగ్ స్టాఫ్)ను నియమించనుంది. జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం నలుగురు గైనకాలజిస్ట్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నెలలో రెండు వందలకు పైగా కాన్పులు జరుగుతుంటే.. వాటిలో సాధారణ కాన్పుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2020 జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు 1,761 ప్రసవాలు జరగగా.. వాటిలో 1372 శస్త్రచికిత్సలు చేశారు. సాధారణ ప్రసవాలు 389 మాత్రమే.
సాధారణ ప్రసవాలపై సర్కారు దృష్టి - normal deliveries in mahabubabad hspital
గర్భిణులకు శస్త్రచికిత్స జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని జాతీయ ఆరోగ్య మిషన్ అధ్యయనం వెల్లడించింది. రాబోయే రోజుల్లో మహిళలు అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా.. శిశువులకూ ప్రమాదమేనని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో సర్కార్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు తగ్గిస్తూ సాధారణ ప్రసవాలు జరిగే విధంగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అత్యవసరమైతే తప్ప శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలు చేయకూడదనే లక్ష్యాన్ని వైద్యశాఖ నిర్దేశించుకుని స్టాఫ్ నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. సుమారు 18 నెలల పాటు తర్ఫీదు పొందిన వీరిని వివిధ ఆస్పత్రుల్లో నియమించింది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి నలుగుర్ని కేటాయించింది. గర్భం దాల్చినప్పటి నుంచి పొందిన వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ప్రసవాలు సులభంగా అయ్యే విధంగా వివిధ ఆరోగ్య నియమాలతో పాటు, వ్యాయామాలు చేయించి వైద్య సేవలు అందిస్తారు. హైరిస్క్, లోరిస్క్ను గుర్తించి, వారిలో భయాన్ని తొలగించి, సాధారణ కాన్పు జరిగే విధంగా సంసిద్ధులను చేస్తారు. హై రిస్క్‌గా భావిస్తే అందుకనుగుణంగా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రసవం జరిగిన తర్వాత మూడు నాలుగు రోజుల్లోనే ఇంటికి పంపిస్తారు.
అమెరికా తరహాలో ప్రసవం
అమెరికా తరహాలో భార్య ప్రసవ సమయంలో భర్త అందుబాటులో ఉండే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తారు. ప్రసవం జరిగాక తల్లి పేగు నుంచి శిశువును వేరు చేసే ప్రక్రియ అమెరికా తరహాలో చేస్తారు. తండ్రితో ఆ పేగును కత్తిరించేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఈ ప్రక్రియను ప్రారంభించారు.