తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్​ ఆవిర్భావ సభ.. అక్కడే ఎందుకు? - సీఎం కేసీఆర్ భద్రాద్రి పర్యటన

CM KCR districts tour : ఈనెల 12 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ జిల్లాల బాటపట్టనున్నారు . ఈనెల 12న కొత్తగూడెం, మహబూబాబాద్‌ కలెక్టరేట్లను సీఎం ప్రారంభించనున్నారు . 18న ఖమ్మం కలెక్టరేట్‌ శ్రీకారానికి ముహూర్తం ఖరారైంది. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎంవో నుంచి అధికారిక సమాచారం అందింది. 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది

CM KCR
CM KCR

By

Published : Jan 9, 2023, 6:51 AM IST

తెలంగాణలో భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికి దిల్లీ, పంజాబ్‌, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, పినరయి విజయన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌లను ఆహ్వానించారు. కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, అఖిలేష్‌లు అంగీకారం తెలపగా... కేరళ సీఎం తమ నిర్ణయాన్ని సోమవారం వెల్లడించనున్నారు.

CM KCR districts tour : పాలనాసౌలభ్యం కోసం అన్ని కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరిన ఖమ్మం, మహబూబాబాద్‌, కొత్తగూడెం కొత్త సమీకృత కలెక్టరేట్లు ప్రారంభానికి ముస్తాబయ్యాయి. ఏజెన్సీ ప్రాంతప్రజలకు అధునాతన వసతులు, ఆధునికహంగులతో తయారైన కలెక్టరేట్లను 12న సీఎం కేసీఆర్ లాంఛనంగాప్రారంభించనున్నారు.

తొలుత మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్​ను ప్రారంభించిన తర్వాత.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కొత్తగూడెం చేరుకుంటారు. అనంతరం కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం ప్రారంభిస్తారు. కొత్త ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్‌ను కూర్చొబెట్టి జిల్లా పాలనకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదేరోజు బీఆర్ఎస్ జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వైద్య కళాశాల, ఫార్మసీ కళాశాలను సందర్శించనున్నారు. ఈనెల18న ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు . సీఎం పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలైంది.

కొత్తగూడెం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొత్తగూడెం-పాల్వంచ జాతీయ రహదారి పక్కనే కొలువుదీరిన కలెక్టరేట్ ఆధునిక హంగులతో కొలువుదీరింది. మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో 45 కోట్లతో నిర్మించారు. 2018లో మొదలైన నిర్మాణం.... జీ ప్లస్ టూ పద్దతిలో 46 ప్రభుత్వ శాఖలు పనిచేసేందుకు అనువుగా రూపొందించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే ప్రత్యేక హెలీప్యాడ్ నిర్మించారు.

మహబూబాబాద్‌లో రూ.64 కోట్లతో చేపట్టిన కలెక్టరేట్‌ను ఈనెల12న సీఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ సహా అధికారులు పరిశీలించారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఖమ్మం-వైరా ప్రధాన రహదారి పక్కనే నిర్మించిన ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం మొత్తం 20 ఎకరాల్లో 59 కోట్లతో నిర్మించారు. ముఖ్యమంత్రి 18న కలెక్టరేట్ ప్రారంభిస్తే అదేరోజు నుంచి జిల్లా ప్రజలకు ప్రభుత్వ పాలన అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

BRS public meeting in khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లా భారాసలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో సీఎం పర్యటన ఆసక్తి రేపుతోంది. 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఖమ్మంలోనే ఎందుకు?ఖమ్మం జిల్లాను కీలకంగా సీఎం భావిస్తున్నారు. జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఏపీలో ఇటీవలే భారాస అధ్యక్షుడిని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ పార్టీ శాఖను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పైగా ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు బలం ఉంది. ఇటీవలి మునుగోడు ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టులతో పొత్తు కుదిరింది. దీనికి తోడు అక్కడ పార్టీలో వర్గ విభేదాలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని భారాస బలాన్ని చాటేందుకు ఖమ్మంలో ఆవిర్భావ సభను నిర్వహించాలని సీఎం నిర్ణయించుకొన్నట్లు తెలిసింది

ABOUT THE AUTHOR

...view details