మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనుల ముఖ్య పండుగ తీజ్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. బయ్యారం మండలం బాల్యతండాలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు వేడుకల్లో పాల్గొన్నారు. దేశంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ఓ ప్రత్యేక స్థానముందని బిందు అన్నారు. నేటి హైటెక్ యుగంలోనూ తండాల్లో గిరిజనులు తమ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారన్నారు. ఈ ఏడాది కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గిరిజన కన్యలకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
గిరిజన యువతులు, మహిళలు తీజ్ వేడుకలను 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. తమకు మంచి వరుడు దొరకాలని, పాడి పంటలు బాగుండాలని తండాల్లో గిరిజన యువతులు కోరుకుంటారు. వెదురు బుట్టల్లో గోధుమ నారు పోసి ఆ బుట్టలను తండాలోని దేవాలయం సమీపంలో ఓ మంచెను వేసి దానిపై ఉంచుతారు.