డబ్బు సంపాదించాలనే దురాశతోనే నిందితుడు మందసాగర్... చిన్నారి దీక్షిత్‌ను కిడ్నాప్‌చేసి పొట్టనపెట్టుకున్నాడు. అపహరించిన రెండుగంటల్లోనే చిన్నారిని చంపడం వల్ల బాలుడిని కాపాడలేకపోయామని మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బాలుడి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీక్షిత్ రెడ్డి ఇక రాడన్న నిజాన్ని జీర్ణించుకోలేని కుటుంబం.... శోకసంద్రంలో మునిగింది. సాగర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిద్ర మాత్రలు ఇచ్చి.. గొంతునులిమి దీక్షిత్ హత్య.. - Mandasagar Latest News
11:57 October 23
నిద్ర మాత్రలు ఇచ్చి.. గొంతునులిమి దీక్షిత్ హత్య..
తోటి వారి కంటే త్వరగా ఎదగాలనే అత్యాశతోనే నిందితుడు మందసాగర్ ఒక్కడే దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి.. హత్యచేశాడని మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌కు చెందిన బాలుడి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడిని ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. సాగర్ స్థానికుడు కావడం వల్ల సీసీ కెమెరాలకు చిక్కకుండా దీక్షిత్‌ను అన్నారం శివారులోని దానమయ్య గుట్టలపైకి తీసుకెళ్లాడు. తొలుత మాటల్లో పెట్టి.. నిద్రమాత్రలు ఇచ్చి.. మత్తులో జారుకున్నాక హత్యచేసినట్లు వెల్లడించారు. పాశవికంగా బాలుడిని చంపేసిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
గుర్తుచేసుకుంటూ... గుండెలవిసేలా..
దీక్షిత్‌రెడ్డి విగతజీవిగా మారడాన్ని ఆ కుటుంబం తట్టుకోలేక తల్లడిల్లిపోతోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ... గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రయోజకుడై ఇంటికి ఆసరాగా నిలుస్తాడనుకున్న దీక్షిత్ ఎక్కడా అంటూ తీరని గర్భశోకంతో గుండెలు బాదుకుంటున్నారు. హత్య వెనక సాగర్‌తో పాటు తమ బంధువుల హస్తం ఉందని చిన్నారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి రాఠోడ్.. వారికి ధైర్యంచెప్పారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దీక్షిత్‌ను పొట్టనపెట్టుకున్న కిరాతకులను వదిలిపెట్టవద్దని... కఠినంగా శిక్షించేలా సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
సంబంధిత కథనాలు...