Check dam shutters destroy in Mahbubabad : భూగర్భ జలాలతో చెరువు అంతా నిండి ఉంది. వచ్చే సీజన్లో పంట బాగా పండించుకోవచ్చని అనుకున్న రైతులకు బాధే మిగిలింది. ఆ చెక్ డ్యాంపై ఇసుక మాఫియా చేస్తున్న దుండగల కన్ను పడింది. సీన్ కట్ చేస్తే వాటికి ఉండే షట్లర్లను ధ్వంసం చేశారు. సాగు కోసం పనికి వస్తాయనుకున్న నీరు అంతా వృథాగా పోతోంది. అది చూసిన అన్నదాతకు గుండెల్లో గుబులు మొదలైంది. అధికారులు ఈ విషయం తెలిసిన ఏమి పట్టనట్టు ఉండడంతో కర్షకులను కలవర పెడుతోంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్రమంగా ఇసుక తరలించేందుకు అడ్డుకట్ట వేసే వారే లేక అదుపు లేకుండా పోతోంది. ఇసుక కోసం అక్రమార్కులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. వారు అంతటితో ఆగకుండా.. తమకు ఎదురులేదనే ధైర్యంతో ఏమి చేయడానికైనా వెనకాడట్లేదు. ఈ క్రమంలోనే నరసింహులపేట మండలం ముంగిమడుగు శివారులో వరద నీటి వృథాను అరికట్టేందుకు.. ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం గతంలో ఆకేరు వాగుపై చెక్ డ్యాంను నిర్మించింది. దీనిలో నిల్వ ఉన్న నీటితో భూగర్భ జలాలు పెరిగాయి. ఆయకట్టు రైతులు విద్యుత్ మోటార్ల ద్వారా సాగు నీటిని వినియోగించుకుని పంటలు సాగు చేసుకుంటున్నాం.