వైద్య సిబ్బంది కొరత.. ఖాళీలు ఎప్పుడు నిండుతాయో..? - Garla Government Hospital news
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల వ్యాప్తంగా 45 వేలకు పైగా జనాభా ఉంది. మండలంలోని గార్ల సామాజిక ఆరోగ్య కేంద్రం, ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వాసుపత్రులుగా ఉన్నాయి. వీటి కింద 11 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. గార్ల సీహెచ్‌సీలో ఉన్న ఒక్కరే వైద్యాధికారి నిరంతరం విధులు నిర్వహిస్తున్నా రాత్రి వేళల్లో సేవలు అందించడానికి రెండో వైద్యాధికారి లేరు. దీంతో కరోనాతో పాటు అత్యవసర వైద్యసేవలందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వైద్య సిబ్బంది కొరత.. ఖాళీలు ఎప్పుడు నిండుతాయో..?
By
Published : Sep 25, 2020, 1:50 PM IST
మహమ్మారి నివారణకు వైద్య సిబ్బంది అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. ఓ వైపు వైరస్ బారిన పడుతూనే.. కోలుకుని వచ్చి మళ్లీ సేవలు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా ఉన్నవారిపైనే అధికరగా భారం పడుతోంది. ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ త్వరలోనే వైద్య సిబ్బంది నియామకాలు చేపడుతామని చెప్పడంతో ఇక్కడ కూడా పూర్తి స్థాయి నియామకం జరుగుతుందని మండల ప్రజలు ఆశిస్తున్నారు.
ఆసుపత్రుల్లో ఖాళీల వివరాలు
గార్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో రెండో వైద్యాధికారి, ఎంఎన్‌వో-2, థోటీ-2, స్వీపర్, రాత్రి కాపలాదారుడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో స్టాఫ్‌నర్సును నియమించాల్సి ఉంది. ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో వైద్యాధికారి, సీహెచ్‌వో, హెచ్‌ఈవో, పర్యవేక్షకుడు, ఏఎన్‌ఎంలు గార్ల-1, గార్ల-3, హెచ్‌ఏ(ఎం)-3, ఎస్‌ఏ, ఓఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అంటువ్యాధులతో అవస్థలు..
గతేడాది గార్ల మండలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా చికెన్ గున్యా, డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయి. అప్పుడు సుమారు 30 మంది వరకు మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత జిల్లా యంత్రాంగం అంటువ్యాధుల నివారణకు కొన్ని చర్యలు తీసుకున్నారు. ఈ సంవత్సరంలోనూ కరోనా కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో డెంగీ జ్వరాల బారిన పలువురు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి ఆర్థికంగా కుదేలైపోయారు. గార్లలో నూతనంగా సీహెచ్‌సీ భవనాన్ని నిర్మించినా వైద్యసిబ్బంది చాలినంతగా లేరు. రాత్రి వేళల్లో స్టాఫ్‌నర్సుల ద్వారా మాత్రమే వైద్యసేవలందుతున్నాయి. ఇప్పటికైనా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఇక్కడి ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పన, పూర్తి స్థాయి నియామకాలు చేపట్టి వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
పూర్తి స్థాయి సిబ్బంది ఉంటేనే
- డాక్టర్ రాణాప్రతాప్, గార్ల సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు
మండలంలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యాధికారులు, సిబ్బంది నియామకాలు చేపడితే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం త్వరలోనే ఆ మేరకు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం.