తెలంగాణ

telangana

ETV Bharat / state

లాఠీతో ఎస్సై వీరంగం... నిబంధనల ఉల్లంఘనతో వార్తల్లోకి... - సీరోలు ఎస్సై వివాదం

తన లాఠీతో వీరంగం సృష్టిస్తూ... వార్తల్లో నిలిచే ఎస్సై రాణాప్రతాప్​ మరోసారి చర్చనీయాంశంగా నిలిచారు. గతంలో ఖమ్మంలో ఓ చెప్పుల దుకాణ యజమానిని చితకబాదిన రాణాప్రతాప్​... తిరిగి సీరోల్ పోలీస్ స్టేషన్​లో చేరారు. అంతలోనే కోర్టులో ఉన్న ఓ సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని... రోడ్డు మీదే ఇద్దరిపై తన లాఠీని ఝుళిపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ... ఇప్పడు వివాదాల్లో చిక్కుకున్నారు.

seerolu si rana pratap hulchal in chinthapally
seerolu si rana pratap hulchal in chinthapally

By

Published : Dec 3, 2020, 10:59 PM IST

లాఠీతో ఎస్సై వీరంగం... నిబంధనల ఉల్లంఘనతో వార్తల్లోకి...

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లిలోని 365 జాతీయ రహదారిపై సీరోల్ ఎస్సై రాణా ప్రతాప్ వీరంగం సృష్టించారు. ఇద్దరు వ్యక్తులను లాఠీతో చితకబాదారు. ఈ దృశ్యాలను చిత్రిస్తున్న గ్రామస్థుల సెల్​ఫోన్లను పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. ఇదంతా ఓ ఇంటిస్థల వివాదం విషయంలో చోటుచేసుకుంది.

గ్రామంలోని 80 గజాల ఇంటి స్థలం విషయంలో ఇరు కుటుంబాల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. పోలీసులు సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నిబంధన ఉన్నా... మరోవైపు కోర్టులో వివాదం నడుస్తున్నా... పోలీసులు తలదూర్చి పామర్తి అంజయ్య, పామర్తి రామదాసులను లాఠీతో తీవ్రంగా కొట్టారు. అడ్డుకున్న వీరమ్మ, నవీన్ సహా... ఈ నలుగురిని బలవంతంగా సీరోల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

మహిళలను రాత్రివేళ స్టేషన్​లో ఉంచరాదనే నిబంధన ఉన్నా... వీరమ్మను ఠాణాలోనే ఉంచారు. రాణా ప్రతాప్ గతంలో ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల చెప్పుల దుకాణం యజమానిని, తన తమ్ముడితో కలిసి చితకబాది సస్పెండ్ అయ్యారు. కొంతకాలం తర్వాత వీధుల్లో చేరారు. అయినా... ప్రవర్తనను మార్చుకోలేదు.

పోలీస్​స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, నిందితులను ఇంటరాగేషన్ చేసే సమయంలో సీసీ కెమెరా కింద, లాయర్ సమక్షంలో చేయాలని సుప్రీకోర్టు తీర్పునిచ్చింది. ఉన్నత న్యాయస్థానాల తీర్పులను కూడా పోలీసులు తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అధికారులు పోలీస్​శాఖకు చెడ్డ పేరు తెస్తున్నా... ఉన్నతాధికారులు మాత్రం వెనుకేసుకొస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.

ఇదీ చూడండి:గ్రేటర్‌లో తెరాసకే పట్టం కట్టిన ఎగ్జిట్‌ పోల్స్‌

ABOUT THE AUTHOR

...view details