కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని అమలు చేయలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గిరిజన యునివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం 350 ఎకరాల భూమిని ఇచ్చినా.. దాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని మంత్రి ఆరోపించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. సింగరేణి, ఇతర సంస్థల సహకారంతో బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.