మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ పర్యటించారు. అనంతరం మండల పరిధిలోని మేచరాజుపల్లి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
కరోనా కేసులు తక్కువే..
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతుందని.. అమెరికా, మహారాష్ట్రలో దీని తీవ్రత చాలా అధికంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందన్నారు. వలస కూలీల రాకతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా మెలగాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో కరోనా సోకలేదన్నారు. వర్షాకాలంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం !
పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పారిశుద్ధ్యం పాటించని వారిపై జరిమానా విధించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ఉపాధిహామీ పథకం కూలీలను వినియోగించుకోవాలన్నారు. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ రైతు బంధుకు రూ.7 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
వ్యవసాయం.. రైతు సంక్షేమం
తెలంగాణ సోనా రకాన్ని రైతులు సాగు చేసుకోవాలని మంత్రి కోరారు. అధిక దిగుబడితో పాటు సన్న రకానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం గోదాంల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కొత్త మండలాల్లో 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాంలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మేచరాజుపల్లిలో రూ.ఒక కోటి నిధులను సిమెంటు రోడ్లకు మంజూరు చేశామన్నారు. ఆకేరు వాగుపై నాలుగు చెక్‌డ్యాంలు మంజూరు చేశామని.. త్వరలోనే పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు.