72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మహబూబాబాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ గౌతమ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరులకు, రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా కలెక్టర్ జోహార్లు అర్పించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధితో ప్రపంచంలోనే భారతదేశం ప్రత్యేకతను చాటుకుందని కొనియాడారు.
కరోనా వారియర్స్‌కు ధన్యవాదాలు
కరోనా నియంత్రణలో భాగంగా పని చేసిన ప్రతి ఒక్కరిని కలెక్టర్ అభినందించారు. జిల్లాలోని 461 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించామని, 652 పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేశామని వివరించారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ద్వారా ఒక కోటి ఆరు లక్షల మొక్కల పెంపకాన్ని చేపట్టి, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 63.22 లక్షల మొక్కలు నాటామని, జిల్లాలో రూ. 18 కోట్లతో 82 రైతు వేదికల నిర్మాణం పూర్తి చేశామని వివరించారు.
ఎన్టీఆర్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అభిలాషా అభినవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆహుతులందరికీ మిషన్ భగీరథ అధికారులు.. మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్‌ను అందించారు.
ఇదీ చదవండి:ఎల్లారెడ్డి పురపాలికలో జాతీయ జెండాకు అవమానం