తెలంగాణ

telangana

ETV Bharat / state

'భూములిచ్చేందుకు మేము సిద్ధం... తగిన పరిహారం ఇప్పించండి' - సీతారామ ఎత్తిపోతల పథకం కాలువ స్థల సేకరణ

రైతులకు సాగునీటి కష్టాలు తీర్చేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఆయకట్టుకు నీరందేలా కాలువల నిర్మాణం చేస్తోంది. అందులో భాగంగానే మహబూబాబాద్‌ జిల్లా గార్ల, డోర్నకల్‌ మండలాల్లోని ఎనిమిది గ్రామాల్లో సీతారామ ఎత్తిపోతల పథకం కాలువ నిర్మాణం చేస్తున్నారు. అందుకు అవసరమైన భూసేకరణ తుది దశకు చేరుకుంది.

'భూములిచ్చేందుకు మేము సిద్ధం... తగిన పరిహారం ఇప్పించండి'
'భూములిచ్చేందుకు మేము సిద్ధం... తగిన పరిహారం ఇప్పించండి'

By

Published : Dec 13, 2020, 3:32 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని సీతారామ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌ను నింపాలని సర్కారు నిర్దేశించుకుంది. అందులో భాగంగా మహబూబాబాద్‌ జిల్లాలోని గార్ల మండలం పుల్లూరు, బుద్ధారంతో పాటు డోర్నకల్‌ మండలం డోర్నకల్, రావిగూడెం, ఉయ్యాలవాడ, బూరుగుపహాడ్, కన్నెగుండ్ల, మన్నెగూడెం గ్రామాల్లోనూ కాలువల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ చేపట్టింది.

కాలువల నిర్మాణానికి అవసరమైన 888.12 ఎకరాల సేకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలోని ఓ గ్రామం నుంచి గార్ల మండలంలోని పుల్లూరు మీదుగా డోర్నకల్‌ మండలం మన్నెగూడెం వరకు... ఖమ్మం జిల్లా తిర్మాలాయపాలెం మండలం నుంచి పాలేరు రిజర్వాయర్‌కు కాలువను అనుసంధానం చేయనున్నారు. అందులో భాగంగా మహబూబాబాద్‌ జిల్లాలోని ఎనిమిమిది గ్రామాల్లో నిర్మించనున్న కాలువ కోసం భూసేకరణకు ఎనిమిది సర్వే బృందాలు చేపట్టిన సర్వే పూర్తయింది.

రైతులతో చర్చలు

ఏజెన్సీ గ్రామాల్లోని రైతులతో అధికారులు పీసా గ్రామ సభ... మైదాన ప్రాంత గ్రామాల్లోని రైతులతో గ్రామసభ నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో ప్రస్తుతం భూసేకరణ తుది దశలో ఉంది. వారికి త్వరలోనే పరిహారం చెల్లించనున్నారు. మిగితా గ్రామాల్లో భూసేకరణకు రైతులు రీసర్వే కోరారు. ఆపనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.

తగిన పరిహారం ఇప్పించండి

కాలువ నిర్మాణానికి అవసరమైన భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు తెలిపారు. కానీ దానికి తగిన పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న పరిహారం సంతృప్తికరంగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్​ ధర ప్రకారం పరిహారం ఇప్పించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి:సొంతింటి కల నెరవేరిన వేళ.. లబ్ధిదారుల ఆనంద హేళ

ABOUT THE AUTHOR

...view details