మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో జిల్లా పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 211 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. రాజోలు, మాధవపురం, మహబూబాద్ పట్టణానికి చెందిన చిరివిరాల నవీన్, వీరభద్రం ,యాదగిరి, సతీష్, దశరథ్ ఒక బృందంగా ఏర్పడి తెల్ల రేషన్‌కార్డుదారుల వద్ద కిలోకి రూ.6 చొప్పున కొని పెద్ద మొత్తంలో నిల్వ చేయమని ఆయా గ్రామాల అనుచరులకు సూచించారు. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని ఈ బృందం రూ.9 చొప్పున కొనుగోలు చేసి నిల్వ చేశారు.
211 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు - అక్రమ బియ్యం పట్టివెత
మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఎవరైనా అక్రమ వ్యాపారాలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాళ్ళ సంకీస వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 211 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీరోలు పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యం స్వాధీనం చేసుకొని.. నిందితులను అరెస్ట్ చేశారు.
నిల్వ చేసిన 422 బస్తాల రేషన్ బియ్యాన్ని లారీలో కురవి మండలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు తాళ్ళ సంకీస వద్ద లారీని పట్టుకున్నారు. పట్టుబడిన 211 క్వింటాల బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.4 లక్షల దాకా ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు . మిగతా ఇద్దరినీ త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అక్రమ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులకు నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట రమణ, సీఐ కరుణాకర్, ఎస్సైలు చంద్రమోహన్, అశోక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా