తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణదాతలు.. ప్లాస్మా వీరులు

కరోనా విపత్కర కాలంలో తమకు తోచిన సాయం చేయడానికి ఎందరో దాతలు ముందుకొొస్తున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల రక్తంలో వైరస్​ను తట్టుకునే యాంటీబాడీస్ ఉంటాయి. వీరి రక్తంలోని ప్లాస్మాను మహమ్మారితో బాధపడేవారికి ఇస్తే వారి ప్రాణాలను కాపాడే వీలు కలుగుతుంది. ఇంతటి విపత్కర సమయంలో ప్లాస్మా దానం చేసి ఎందరో ప్రాణాలను కాపాడుతున్నారు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన యువకులు.

By

Published : May 9, 2021, 12:05 PM IST

PLASMA DONORS, mahabubabad plasma donors
ప్లాస్మా దాతలు, మహబూబాబాద్ ప్లాస్మా

కొవిడ్‌ బారిన పడి కోలుకున్న వారి శరీరంలో వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీస్‌ వృద్ధి చెందుతాయి. వీరి రక్తంలో ఉండే ప్లాస్మాను కరోనాతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఎక్కిస్తే వారి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొవిడ్‌ రెండో దశ ఎక్కువగా ఉంది. తక్కువ సమయంలోనే తీవ్రంగా మారి ప్రాణాలను హరిస్తోంది. ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతుండటం పెద్ద సమస్యగా మారింది. ఇంతటి విపత్కర సమయంలో ప్లాస్మా దానం చేసి ఎందరో ప్రాణాలను కాపాడుతున్నారు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన యువకులు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన యువ నేతాజీ ఫౌండేషన్‌ నిర్వాహకుడు కొత్తకొండ అరుణ్‌కుమార్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం సిబ్బంది ఏఆర్‌ కానిస్టేబుల్‌ కన్నె రాజు గతంలో రక్తదానాలు చేయడంతో పాటు అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం వారి వద్ద రెండు వేల మంది రక్తదాతల వివరాలున్నాయి. వారి ఆధారంగానే ప్లాస్మా దానం చేయాలంటూ వారిని చైతన్యపరుస్తూ వస్తున్నారు. కరపత్రాలతో పాటు వీడియోలను తయారు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. వీరి స్ఫూర్తితో ఇప్పటివరకు చాలామంది ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలా మొదటి దశ నుంచి రెండో దశ కరోనాతో బాధపడుతున్న బాధితుల ప్రాణాలను నిలపడానికి 140 మంది ప్లాస్మా దానం చేశారు.

ఐదుగురికి ప్లాస్మా ఇచ్చాను..

ఉపాధ్యాయ వృత్తిలోకి రాకముందు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాను. గతేడాది డిసెంబర్‌లో కరోనా పాజిటివ్‌ రాగా కోలుకున్నాక ఇప్పటి వరకు ఐదుగురికి ప్లాస్మా దానం చేశాను. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు. ప్లాస్మా దానం చేస్తే యాంటీబాడీస్‌ పెరుగుతాయి తప్ప తగ్గవు. ప్రస్తుతం టీకా తీసుకున్న వాళ్లు ఇవ్వొద్దని చెప్పడంతో ఆగిపోయా. రెండు డోసులు వేయించుకున్నాక నెల రోజుల తర్వాత అవసరమైన వారికి మళ్లీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.

-డి.మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, ముల్కనూరు, భీమదేవరపల్లి మండలం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

మరొకరు ఇబ్బంది పడొద్దనే..

మొదటి దశ కరోనా సమయంలో కుటుంబ సభ్యులందరం వైరస్‌ సోకి ఇబ్బందిపడ్డాం. మా పెద్దనాన్న కాస్త అవస్థలు పడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చాలా డబ్బులు ఖర్చయ్యాయి. మాలాంటి ఇబ్బందులు మరొకరు పడొద్దనే ఉద్దేశంతోనే గతంలో రక్తదానం చేసిన అనుభవం ఉండటంతో ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చాను. ఇప్పటివరకు ఆరుసార్లు ఇచ్చాను. సామాజిక మాధ్యమాల్లో అడిగిన వారికి కూడా దానం చేశాను.

-డి.సంతోష్‌, ప్రైవేటు ఉద్యోగి, వరంగల్‌ అర్బన్‌

ఒకేసారి ఇద్దరికి దానం చేశా..

నాకు చిన్నప్పటి నుంచి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం. యువనేతాజీ ఫౌండేషన్‌ అవగాహన కల్పించడం, ప్లాస్మా దానంతో ప్రాణాలు కాపాడవచ్చని వార్తా విశ్లేషణలు చూసి నేను కూడా ముందుకొచ్ఛా అలా ఒకేసారి ఇద్దరికి సరిపడా ప్లాస్మాను దానం చేశాను.

- వెంకటేశ్‌, పీజీ విద్యార్థి, భూపాలపల్లి

యువ నేతాజీ ఫౌండేషన్‌ స్ఫూర్తితో..

యువ నేతాజీ ఫౌండేషన్‌ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే అందులో పాల్గొన్నా. వారి వాట్సాప్‌ బృందంలో సభ్యుడిగా చేర్చారు. ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా ప్రతి మంచి పని గురించి అందులో పోస్టు చేస్తూ చైతన్యపరుస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ప్లాస్మా దానం చేసి మరొకరికి ప్రాణాలు కాపాడొచ్చనే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో కానిస్టేబుల్‌ కన్నె రాజు ద్వారా ప్లాస్మా దానం చేశాను.

- ముస్తాఫా, పరకాల, వరంగల్‌ రూరల్‌ జిల్లా

ఇదీ చదవండి:ఈ సయ్యద్.. సదాశివపేట సోనూసూద్​

ABOUT THE AUTHOR

...view details