అబ్దుల్ ఇమ్ము.. అసలు పేరు ఇమ్రాన్. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన ఇతనో దివ్యాంగుడు. పోలియో కారణంగా చిన్నప్పుడే ఎడమకాలు పనిచేయకుండా పోయింది. దివ్యాంగుడైనంత మాత్రాన తాను ఏమి చేయలేనా..? అని ఆలోచించాడు. దేహదారుఢ్య పోటీల్లో సత్తాచాటుతున్న యువకుల దృశ్యాలను యూట్యూబ్‌లో చూశాడు. కాళ్లు లేనివాళ్లే బాడీబిల్డింగ్ రంగంలో రాణిస్తుంటే.. తానూ ఆ రంగాన్ని ఎందుకు ఎంచుకోకూడదని భావించాడు.
కోచ్ సహకారంతో:
జిల్లాలోని అల్తాఫ్ ఫిట్‌నెస్ సెంటర్ కోచ్ ఆల్తాఫ్‌ను సంప్రదించాడు. బాడీబిల్డింగ్‌పై ఇమ్రాన్ మక్కువను గమనించిన కోచ్ అల్తాఫ్ ఇమ్రాన్ అతన్ని పోత్సహించాడు. రోజూ నాలుగైదు గంటల శిక్షణ, పోషకాహారం అందించాడు. మొదట మండల స్థాయి దివ్యాంగుల బాడీ బిల్డింగ్ పోటీల్లో రంగంలోకి దిగాడు. అక్కడ ప్రథమ బహుమతి గెలుచుకున్న ఇమ్రాన్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు:
జిల్లాస్థాయి పోటీల్లో 17సార్లు పాల్గొనగా 11 బంగారు పతకాలు, 2016లో రాష్ట్ర స్థాయి 11 పోటీల్లో పాల్గొంటే.. 7 స్వర్ణం, 3 రజత, ఒక కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 2019 ఫిబ్రవరిలో జరిగిన 10వ జాతీయ స్థాయి దివ్యాంగ దేహదారుఢ్య పోటీల్లో తలపడ్డ ఇమ్రాన్ రజత పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.