మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం శివారులోని ఆకేరు వాగు ఇసుక దందాకు అడ్డాగా మారింది. అభివృద్ధి పనుల పేరుతో దళారులు ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ఈ నెల 24న వాగు నుంచి ఇసుక తరలింపునకు నిబంధనలకు విరుద్ధంగా 250 ట్రాక్టర్లకు అధికారులు కూపన్లు జారీ చేశారు. దీంతో గ్రామం నుంచి వాగు వరకు 300 ట్రాక్టర్లకు పైగా బారులు తీరాయి. శుక్రవారం ఆకేరు వాగులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 20 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోవడం కలకలం రేపింది.
ఇంత పెద్ద మొత్తంలో కూపన్లు ఎలా జారీ చేశారనే కోణంలో జిల్లా ఉన్నతాధికారులు వివరాలు సేకరించారు. దీనికి తోడు ఇసుక అక్రమ దందాపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్ పున్నం చందర్‌ను.. కలెక్టర్ గౌతమ్ శుక్రవారం రాత్రి సస్పెండ్ చేసినట్లు ఇన్‌ఛార్జి ఆర్డీవో కొమురయ్య తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ తహసీల్దార్ వీరన్నను కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగం డీటీగా, ఆర్‌ఐ నారాయణను గంగారం మండలానికి బదిలీ చేసినట్లు చెప్పారు.