మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై కోతులు ఆకలి తీర్చుకుంటున్నాయి. లారీల్లోంచి రాలిపోయిన మొక్కజొన్న గింజలను ఏరుకుని తింటూ ఆకలిని తీర్చుకుంటున్నాయి. మండలంలోని బీరిశెట్టిగూడెం స్టేజీ వద్ద పిల్లకోతితో రోడ్డు దాటుతున్న వానరాన్ని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లింది. దీంతో తల్లికోతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన కోతి రోడ్డుపై నిద్రిస్తున్న రీతిలో పడిపోయి ఉంది. తల్లి మృతి చెందిందనే విషయం తెలియని పిల్ల కోతి తల్లి కోతికి కొద్ది దూరంలో దీనంగా కూర్చుంది.
తల్లి తిరిగివస్తుందేమోనని... దీనంగా ఎదురుచూపులు
ఆకలి తీర్చుకునేందుకు ప్రాణులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మనుషులతో పాటు కోతులకు కష్టాలు తప్పేలా లేవు. ఓ వైపు వానరమూక తమ కడుపు నింపుకునేందుకు ఆకలి పోరాటాలు కొనసాగిస్తున్నాయి.... కాగా మరో వైపు అర్ధాంతరంగా తనువు చాలించిన తల్లి కోసం పిల్ల కోతి తల్లడిల్లిన తీరు అందరినీ కలచివేసింది.
తల్లి తిరిగివస్తుందేమోనని... దీనంగా ఎదురుచూపులు
రోడ్డుపై వాహనాలు వచ్చి వెళ్లే సమయంలో దూరంగా వెళ్లడం...తరువాత మృతి చెందిన కోతి వద్దకు వచ్చి కూర్చోవడం అక్కడున్న వారిని తీవ్రంగా కలిచి వేసింది. తల్లి రోడ్డుపై పడుకుందేమో... తన కోసం వస్తుందనే ఆశతో పిల్ల కోతి అక్కడే కొంత సేపు తిరుగుతూ కనిపించింది. అనంతరం గ్రామస్థులు మృతి చెందిన కోతిని తీసుకెళ్లి దూరంగా పడేశారు.