అటవీ అధికారులు రైతుల జోలికి పోవద్దని ఎమ్మెల్యే శంకర్ నాయక్ సూచించారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకుండా అన్నదాతలను అడ్డుకోవద్దన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పోడు భూములను ఆయన పరిశీలించారు. ఆయా భూములను చదును చేసేందుకు వచ్చిన జేసీబీ అడ్డుకుని అక్కడినుంచి పంపించేశారు. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా పోడు భూములపై రైతులకు, అటవీశాఖ అధికారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
పోడు రైతుల సమస్యలను, మ్యాప్‌లను ఎమ్మెల్యే పరిశీలించారు. కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులు గిరిజనులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ప్రజలందరూ చూస్తునే ఉన్నారని చెప్పుకొచ్చారు. గతంలో పని చేసిన ఫారెస్ట్ అధికారులు వందల ఎకరాల భూములను అమ్ముకున్నారని ఆరోపించారు.
అడవులను కొట్టివేయడం తప్పయినా.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కు పత్రాలను జారీ చేసింది. అటవీ అధికారులు.. 2005 సంవత్సరం కన్నా ముందు పోడు చేసి, పత్రాలు కలిగిన భూముల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం కేసీఆర్ త్వరలోనే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తారు. హామీలను తప్పక నెరవేరుస్తారు.