మహబూబాబాద్ జిల్లాలో లాక్డౌన్ సమర్థంగా అమలవుతుందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో కలిసి పోలీస్ చెక్‌పోస్ట్‌లు, లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని మంత్రి పేర్కొన్నారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 750 ఫీవర్ సర్వే బృందాలు మరోసారి సర్వే చేయనున్నారని.. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా బృందానికి తెలియజేయాలని సూచించారు. జిల్లాలో 250 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని, కరోనా బాధితులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని సూచించారు.