బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో గత నాలుగు రోజులుగా మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్గాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగిపొర్లతున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. రహదారులన్నీ జలమయంగా మారాయి.
మహబూబాబాద్ శివారులో ప్రవహించే మున్నేరు వాగు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాఠోడ్, ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ బిందు,ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లతో కలిసి మున్నేరు వాగు ప్రవాహాన్ని, వర్షపు నీరు చేరిన రామన్నపేట, గుండ్లకుంట, తదితర కాలనీలను పరిశీలించారు. జిల్లాలో ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, బంధం వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.