'రాష్ట్రానికి నేను మంత్రిని కావచ్చు.! మీకు మాత్రం అమ్మను...!!’ అంటూ రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఇద్దరు అనాథ పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు. డోర్నకల్‌కు చెందిన రషీద్ పాషా(28), అతడి తల్లి జహీరా బేగం(58) ఈ నెల 8వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పాషా ఇద్దరు కుమార్తెలు అనాథలైనట్లు తెలుసుకుని డోర్నకల్‌కు వచ్చారు. నాలుగేళ్ల కరిష్మాని తన ఒడిలో కూర్చోబెట్టుకుని... ప్రమాదంలో గాయపడి కాలికి జరిగిన శస్త్ర చికిత్సతో వారం రోజులుగా మంచానికి పరిమితమైన తొమ్మిదేళ్ల సుహానాని ఓదార్చారు.
ఊహ తెలియని వయసులో ఇంత కష్టమా? ఆ భగవంతుడికి కూడా దయ లేకపాయే? అంటూ మంత్రి కంటనీరు పెట్టుకున్నారు. అనంతరం పిల్లల కుటుంబ నేపథ్యం గురించి వాకబు చేసి ‘మీ ఇద్దరిని నేను తీసుకెళతానని.. ప్రభుత్వ చిల్డ్రన్స్ హోంలో చేర్పించి.. ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని.. మీకు అమ్మలా ఉంటానంటూ ధైర్యం నూరిపోశారు. పిల్లల నాన్న, నానమ్మల కర్మలు పూర్తయ్యాక బంధుమిత్రులు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు దత్తత తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. పిల్లలకు తోడుగా వచ్చి వారి సంరక్షణ బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటామంటే ఒకరికి చిల్డ్రన్స్ హోంలో ఉద్యోగం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కర్మల నిర్వహణ కోసమని రూ.25 వేలు ఇస్తానన్నారు.