హైదరాబాద్‌లో సైదాబాద్‌లో చిన్నారిపై హత్యాచారం(saidabad incident) జరగడం దురదృష్టకరమని... నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(sathyavathi rathod) తెలిపారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రాజు కోసం 10 బృందాలు, 200 మంది పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుడి కుటుంబసభ్యులు తమ ఆధీనంలోనే ఉన్నారని... అతడికి కుటుంబసభ్యులతో సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఆచూకీ దొరకడం కష్టంగా మారిందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాలను పరిశీలించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలకు స్థల పరిశీలన చేశారు. మెడికల్ కళాశాల రావడం వల్ల ఆ ప్రాంతంలోని గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడిన వారు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం తప్పుతుందని తెలిపారు.
చిన్నారి మృతి చెంది ఇప్పటికి ఆరు రోజులైంది. ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. దురదృష్టకరం. బాధిత కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి? నిందితున్ని ఎలా పట్టుకోవాలనే దానిపై మేం చేసేది చేస్తున్నాం. కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని మేం అన్ని రకాలుగా ఆదుకుంటాం. నిందితుడి ఆచూకీ కోసం 10 టీంలు... దాదాపు 200 మంది పోలీసులు గాలిస్తున్నారు. ఎవరితోనూ అతనికి సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఆలస్యమవుతోంది. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం.
-సత్యవతి రాఠోడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి