TEEZ FESTIVAL: తీజ్ వేడుకల్లో స్టెప్పులేసిన ప్రజాప్రతినిధులు.. ఎక్కడంటే..? మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాల్యాతండాలో జరిగిన తీజ్ వేడుకల్లో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌లు పాల్గొన్నారు. గిరిజన ఆడపడుచులతో కలిసి ఆనందంగా నృత్యం చేశారు. సకల శుభాలు కలగాలంటూ తీజ్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆనందోత్సహాల మధ్య గోధుమ నారు బుట్టలను సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు.
అంతకుముందు మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి బయ్యారం మండలం బాల్యాతండాకు వస్తుండగా.. మార్గమధ్యలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే హరిప్రియలు ఓ పొలంలో దిగి.. నాటు వేశారు. తామూ పొలం పనులు చేస్తామంటూ కూలీలతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి.. బాల్యాతండాలో తీజ్ వేడుకల్లో పాల్గొన్నారు.
నాట్లు వేస్తున్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ ఏంటీ తీజ్ పండగ..
ప్రకృతి చల్లగా చూడాలని.. మంచి భర్త దొరకాలని గిరిజన కన్నె పిల్లలు శ్రావణ మాసంలో 9 రోజుల పాటు తీజ్ పండుగను జరుపుకుంటారు. వెదురు బుట్టలలో గోధుమలను నాన పెట్టి, ఓ ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్న మంచెపై ఉంచుతారు. 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆ మంచెపై ఉన్న గోధుమ బుట్టలకు నీరు పోసి పూజలు చేస్తారు.
9వ రోజు సాయంత్రం తండాలోని కన్నెపిల్లలు, మహిళలంతా కలిసి మొలకెత్తిన గోధుమ బుట్టలను నెత్తిపై పెట్టుకుని ఆడుతూ.. పాడుతూ ఆనందోత్సహాల మధ్య తీజ్ పండుగను జరుపుకుంటారు. అనంతరం గోధుమనారు బుట్టలను సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.
ఇదీ చూడండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 245 కరోనా కేసులు.. ఒకరు మృతి