తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్‌ పార్టీ గోడలు పెచ్చులూడిపోయాయి: మంత్రి సత్యవతి

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భాజపా పాలన, కాంగ్రెస్‌పై మంత్రి విమర్శలు గుప్పించారు.

minister sathyavathi rathode
మంత్రి సత్యవతి రాఠోడ్‌

By

Published : Feb 26, 2021, 8:44 AM IST

కూలిపోయి శిథిలావస్థ స్థితికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ.. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో గిరిజనులు ఎవరూ దొరకనట్లు ఎక్కడి నుంచో రాములు నాయక్‌ను తీసుకువచ్చిందని మంత్రి సత్యవతి రాఠోడ్‌ విమర్శించారు. ఈ సంఘటనతోనే కాంగ్రెస్ నైతికంగా ఓడిపోయిందనే విషయం అర్థమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. ఈ ప్రాంతానికి ఏం చేయలేదని, విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయలేదని మంత్రి ఆరోపించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు తప్పుడు నివేదికలు ఇచ్చి కర్మాగారం ఏర్పాటుకు అడ్డుపడ్డారని మండిపడ్డారు. నియోజకవర్గంలో పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలిచేలా కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ మాలోతు కవిత, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు, ఉపాధ్యాయులు, తెరాస కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సిలిండర్ ధర పెరిగినా.. రాయితీ మాత్రం అంతే..

ABOUT THE AUTHOR

...view details