KTR Tweet on Bayyaram Steel Factory: మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం ఉక్కు కర్మాగారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్దేశపూర్వకంగానే మొండిచెయ్యి చూపారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇదంతా తన మిత్రుడైన అదానీకి లబ్ధి చేకూర్చేందుకేనన్నారు. అదానీ వ్యవహారంలో ఇప్పటికే పలుమార్లు కేంద్రంపై నిప్పులు చెరిగిన కేటీఆర్.. మరోసారి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమ రాష్ట్రానికి రాకపోవడం వెనకున్న ప్రధాని నిర్వాకాన్ని టీఎస్‌ఎండీసీ ఛైర్మన్ క్రిషాంక్ వెల్లడించారన్న మంత్రి.. ఆ వివరాలను తన ట్వీట్‌కు జత చేశారు. దేశ ప్రజల ప్రయోజనాల కంటే తన స్నేహితుడి ప్రయోజనాలే ప్రధానికి ఎక్కువ కావడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
Minister KTR Today Tweet: ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలోని హామీ ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గతంలో లేఖ రాసిందని మంత్రి గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్ర వినతిని మోదీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇదే సమయంలో బైలడిల్లా నుంచి కొరియన్ కంపెనీ అయిన పాస్కోకు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం 2018 ఏప్రిల్‌లో తీసుకున్నారన్న మంత్రి.. సరిగ్గా 5 నెలల తర్వాత బైలడిల్లాను అదానీ స్వాధీనం చేసుకున్నారని వివరించారు.
అసలు కారణం ఇప్పుడు తెలిసింది..: ఆ తర్వాత అదానీ కంపెనీ, కొరియన్ కంపెనీ అయిన పాస్కోలు దాదాపు రూ.38000 కోట్ల స్టీల్ మిల్ ఒప్పందంపై సంతకాలు చేశాయని పేర్కొన్నారు. ఈ కారణంగానే బయ్యారం ఉక్కు పరిశ్రమకు మొండి చెయ్యి చూపారని క్రిషాంక్ ట్వీట్ చేశారన్న కేటీఆర్.. మంచి పరిశోధన చేసి వాస్తవాలను బయటపెట్టారంటూ క్రిషాంక్‌ను అభినందించారు. ఈ సందర్భంగా బయ్యారానికి ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి గల అసలు కారణం ఏమిటో మనకు ఇప్పుడు తెలిసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.