రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 15 వేలకోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని.. కరోనా సంక్షోభంతో 350 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుబంధు, పింఛన్లకు అప్పు తెచ్చి ఇస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నిరుద్యోగులంతా ఆరు నెలలు ఓపిక పడితే సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తారన్నారు. రాష్ట్రంలో సన్న వడ్లకు ఎక్కువ ధర పెట్టాలని భాజపా నాయకులు గగ్గోలు పెడుతున్నారన్నారు. అయితే సన్న వడ్లకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టొద్దని కేంద్రం లేఖ రాసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్రానికి పన్నుల రూపంలో 50 నుంచి 60వేలకోట్ల రూపాయలు చెల్లిస్తుందని పేర్కొన్నారు. దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధికంగా తెలంగాణా చెల్లిస్తుందన్నారు. కేంద్రం నుంచి మాత్రం 10 నుంచి 12 వేల కోట్ల రూపాయలే వస్తున్నాయని స్పష్టం చేశారు.