పండుగ పూట విషాదం - రోడ్డు ప్రమాదంలో కుటుంబం బలి Mahabubabad Road Accident Today : మూడేళ్ల క్రితం భార్య చనిపోయింది. తల్లిలేక తల్లడిల్లుతున్న ముక్కుపచ్చలారని చిన్నారులు. ఇంటికేదో శనిపట్టిందని, మొక్కు తీర్చుకుంటే బాగవుతుందని దేవుడి వద్దకు వెళ్లిన ఓ కుటుంబానికి అదే చివరి రోజైంది. రోడ్డు ప్రమాదం రూపంలో దారికాచిన మృత్యువు ఇద్దరు చిన్నారులు సహా, తల్లీకుమారుడిని బలితీసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో రాత్రి చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదం పండుగపూట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాధితులపై కఠిన చర్యలు చేపట్టాలని తండా వాసులు నిరసన చేపట్టారు. డీఎస్పీ కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నిరసనను విరమించుకున్నారు. మృతుల బంధువులను ఎంపీ కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పరామర్శించారు.
స్థానికులు, పోలీసులు తెలపిన వివరాల ప్రకారం :మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్నఎల్లాపురం గ్రామానికి చెందిన శ్రీను-శిరీషకు కొంతకాలం క్రితం వివాహమైంది. వీరిద్దరికీ రిత్విక్, రిత్విక అనే ఇద్దరు పిల్లలుండగా కరోనా సమయంలో శిరీష చనిపోయింది. భార్య మృతి, చిన్నారుల దయనీయ పరిస్థితితో మానసికంగా కుంగిపోయిన శ్రీను, ఇంట్లో పరిస్థితులు బాగాలేవని పూజలు, పుణ్యక్షేత్రాలకు తిరుగుతున్నాడు.
ఈ క్రమంలోనే తల్లి 'పాప', ఇద్దరు పిల్లలు, బావమరిది సర్దార్, అత్త శాంతితో కలిసి శ్రీను, ఆదివారం ఆటోలో నాగార్జునసాగర్ సమీపంలోని గుండ్లసింగారంలోని బుడియాబాపు ఆలయానికి వెళ్లాడు. పూజలు ముగించుకుని సాయంత్రం బయలుదేరిన శ్రీను మహబూబాబాద్ వచ్చేసరికి రాత్రయింది. ఈ క్రమంలోనే కంబాలపల్లి, జిమ్మాండ్లపల్లి గ్రామాల మధ్యనున్న అర్బన్‌పార్కు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన కారు, శ్రీను కుటుంబం వెళ్తున్న ఆటో ఢీకొన్నాయి. కారు వేగంగా ఢీకొనటంతో నుజ్జునుజ్జైన ఆటోలోనే వారు ఇరుక్కుపోయారు.
రాష్ట్రంలో నెత్తురోడిన రహదారులు - వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
Family Killed in Road Accident at Kambalapally : రోడ్డు ప్రమదంపై స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే శ్రీను, ఆయన తల్లి పాప, కుమార్తె రిత్విక ప్రాణాలు కోల్పోయారు. కొనఊపిరితో ఉన్న రిత్విక్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానేమృతిచెందాడు. ఆటోలో ఉన్న శ్రీను బావమరిది సర్దార్, అత్త శాంతి తీవ్రంగా గాయపడగా, వారిని మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురికీ తరలించారు. దేవుడికి మొక్కు తీర్చుకునేందుకు వెళ్లిన వారంతా విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి, వారి బంధువులు రోదించిన తీరు ఆసుపత్రి వద్ద ఉన్న వారిని కంటనీరు పెట్టించింది.
Kambalapally Road Accident Update : ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తండా వాసులు ఆస్పత్రి దగ్గర నిరసనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. డీఎస్పీ సత్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళనను విరమించారు. బాధిత కుటుంబసభ్యులను ఎంపీ కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌లు పరామర్శించారు.
"ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరం. కారులో ఉన్న వారు మద్యం సేవించి అతి వేగంగా నడిపి నలుగురు మృతికి కారణమైయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత కేసును పక్కదారి పట్టించేందుకు కారును తిప్పి పెట్టారు. ప్రమాద సమయంలో ప్రత్యక్షంగా నేను అక్కడ నుంచి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించాను. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు పరిహారం అందించేలా కృషి చేస్తాను."-బలరాం నాయక్, మాజీ కేంద్ర మంత్రి
ఆటో, బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ - ఐదుగురి దుర్మరణం
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు- ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!