మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా కురిసిన వర్షానికి వాగులు, చెరువులన్నీ నిండుకుండలా మారి పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. మహబూబాబాద్‌లో ప్రవహించే మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, బంధం వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
వంతెనల వద్ద బారికేడ్ల ఏర్పాట్లు
వాగులు పొంగి పొర్లడం వల్ల రహదారులపైకి నీరు చేరుతోంది. కేసముద్రం, నెక్కొండ, గార్ల మండలం నుంచి రాంపురం, మద్దివంచల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను ఆయా గ్రామాల పంచాయతీకార్మికులు తొలగించి శుభ్రం చేస్తున్నారు. వాగుల ప్రవాహాలు ఉద్దృతంగా సాగడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు.
కొత్తగూడలో కలెక్టర్ పర్యటన
మహబూబాబాద్ మండలం వేమునూరులో రెండు ఇళ్లు, బయ్యారం మండలం కోటగడ్డలో ఒక ఇల్లు కూలిపోయింది. వేలాది ఎకరాల్లోని వరి, పత్తి పంట నీట మునిగింది. ఇతర పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లా కలెక్టర్ గౌతమ్.. కొత్తగూడ మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కొత్తపల్లి, బర్కపల్లె వాగులను పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వాగుల వద్దకు ఎవరూ వెళ్లొద్దు..
గ్రామాధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లోనే ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, వాగుల వద్దకు ఎవరూ వెళ్లకూడదని సూచించారు. ప్రతిగ్రామంలో గర్భిణుల వివరాలు సేకరించి తనకు తెలియజేయాలని కార్యదర్శులకు చెప్పారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వరదలు, పంట నష్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ గౌతమ్ సమీక్ష నిర్వహించారు.