తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు ఖమ్మం, మహబూబాబాద్​ల​లో కేసీఆర్​ పర్యటన - మహబూబాబాద్​లో నేడు కేసీఆర్ పర్యటన

16 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తెరాస ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇప్పటికే జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్​ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు చవి చూసిన ఖమ్మంలో సీఎం పర్యటనపై సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.

మహబూబాబాద్​లో నేడు కేసీఆర్ పర్యటన

By

Published : Apr 4, 2019, 10:20 AM IST

మహబూబాబాద్​లో నేడు కేసీఆర్ పర్యటన
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇవాళ మహబూబాబాద్​, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మహబూబాబాద్​ బహిరంగ సభకు హాజరు కానున్న సీఎం అనంతరం ఖమ్మంలో సభలో పాల్గొననున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచిన వేళ పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెరాస శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ముందుంచి వారి మద్దతు కోరనున్నారు.

సిట్టింగ్​ను కాదని...

నేతల మధ్య కొరవడిన సమన్వయం, ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఖమ్మం జిల్లాలో సిట్టింగ్​ను కాదని వ్యూహాత్మకంగా కొత్తగా పార్టీలో చేరిన నామ నాగేశ్వరరావుకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాల్లో తెరాస కేవలం ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఈ ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎం జిల్లాలో పట్టు సాధించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

భారీగా జన సమీకరణ..

కోల్పోయిన చోటే సాధించుకోవాలన్న తపనతో ఉన్న గులాబీ దండు సీఎం బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీ జనసమీకరణకు సిద్ధమైంది. ప్రతీ నియోజక వర్గం నుంచి 20 వేలకు తగ్గకుండా కార్యకర్తల్ని తరలించడం ద్వారా 2 లక్షల మందితో ముఖ్యమంత్రి సభ విజయవంతం అయ్యేలా తెరాస నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సర్వత్రా ఆసక్తి..

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో అగ్రస్థానంలో ఉన్న ఖమ్మంలో ఊహించని ఫలితాలు తెరాసకు మింగుడు పడడం లేదు. ఇటువంటి పరిస్థితుల మధ్య జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజల ముందుంచడమే కాకుండా.. భవిష్యత్తులో జిల్లా అభివృద్ధికి కార్యాచరణను సీఎం ప్రకటించనున్నారు.

ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకునే దిశగా కేసీఆర్​ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ సఫలీకృతం అవుతాయో వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండిఃజగిత్యాలలో నేడు నమూనా పోలింగ్​ కేంద్రం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details