మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో కుప్పలు తెప్పలుగా పాములు బయటకు రావడం కలకలం రేకేత్తిస్తోంది. మొదటి రోజు 30 పాము పిల్లలు, 2 తేళ్లు గోడల రంధ్రాల నుంచి బయటకు వచ్చాయి. స్థానికులు వాటన్నింటినీ చంపేయగా... రెండో రోజు అంగన్వాడీ కేంద్రాన్ని పక్కనే ఉన్న మరో గదిలోకి మారుస్తుండగా మరో 6 పాము పిల్లలు బయటకు వచ్చాయి. వాటిని కూడా గ్రామస్తుల సాయంతో చంపేశారు.
అంగన్వాడీ కేంద్రం.. పాములకు ఆవాసం - నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో పాముల కలకలం
మీ పిల్లలను అంగన్వాడీకి పంపిస్తున్నారా? అయితే కాస్తా మీ పిల్లల భద్రత గురించి ఆలోచించండి. ప్రభుత్వ ఆధీనంలో నడిచే అంగన్వాడీలు నిర్లక్ష్యానికి నిలయంగా మారాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో తెలియని అయోమయానికి గురి చేస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులకు పాఠాలు బోధించాల్సిన అంగన్వాడీలు పాములకు ఆవాసంగా నిలుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో గోడలు, బండలు కింద నుంచి పాము పిల్లలు బయటకు వస్తున్నాయి. రెండో రోజు కూడా వరుసగా పాములు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలు రాకపోవడంతో తప్పిన ప్రమాదం:
కొవిడ్ నిబంధనల వల్ల ఆహారాన్ని ఇంటి వద్దకే అందించడం వలన పిల్లలెవరూ అంగన్వాడీ కేంద్రానికి రావడం లేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని ఓ గదిలో అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతోనే పాములు, తేళ్లు వస్తున్నాయని... వెంటనే అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాన్ని తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న సీడీపీవో హైమావతి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామ సభలో అంగన్వాడీ కేంద్రాన్ని మరమ్మతులు చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు. అంగన్వాడీ కేంద్రం పక్కనే చెరువు ఉండడం వల్ల పాములు వస్తున్నాయని సీడీపీవో పేర్కొన్నారు. వెంటనే కేంద్రాన్ని మరో చోటకు మార్చుతున్నట్లు వెల్లడించారు.